PAWAN: పింఛన్ల పంపిణీ విజయవంతం అవ్వడం హర్షణీయం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు... సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తామని పవన్‌ ప్రకటన;

Update: 2024-08-02 04:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 64 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఈ రోజు ఉదయం నుంచీ ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లు అందించేలా చంద్రబాబు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైంది అని పేర్కొన్నారు. అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పవన్‌ అన్నారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాల అమలుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఏపీ వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తైందని అధికారులు తెలిపారు. తొలి రోజునే 96 శాతం పెన్షన్లను పంపిణీ చేసి ఎన్డీయే కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది.. సాయంత్రం 4 గంటల సమయానికి 96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన నాలుగు శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేసేలా సచివాలయ ఉద్యోగుల ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ చేశారు.

వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం

వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో నిర్వహించిన ప్రజావేదికలో పింఛను లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే వైసీపీ పాలనలో ఇష్టానుసారం దోపిడీ చేశారని విమర్శించారు. సర్వే రాళ్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫొటోలు వేయించుకున్నారని విమర్శించారు.ఐదేళ్లలో పేదలకు ఇళ్లు కట్టలేదు కానీ, రుషికొండలో ప్యాలెస్‌ కట్టారని గుర్తు చేశారు. తాము పాలకులం కాదని.... సేవకులమని గుర్తించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. వాస్తవాలు తెలియాలని 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు.

Tags:    

Similar News