PAWAN: పాపం వాలంటీర్లు... పవన్ సంచలన వ్యాఖ్యలు
వాలంటీర్లను ప్రభుత్వం మోసం చేసిందన్న పవన్... జీవోలో వాళ్ల ప్రస్తావనే లేదని వెల్లడి;
వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ సంఘాలతో అమరావతిలో సమావేశమైన పవన్.. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ ల విజ్ఞప్తిపై స్పందించారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని పవన్ అన్నారు. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చని, కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరని, ఇదో సాంకేతిక సమస్య అని పవన్ అన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసిందని, వాలంటీర్లకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ఉందని పవన్ చెప్పారు. వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చని, కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదో సాంకేతిక సమస్య అని, అందుకే అపరిష్కృతంగా ఉందని పవన్ చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం పక్కనబెట్టిన కారణాన్ని పవన్ పరోక్షంగా చెప్పేశారు. తాజాగా పవన్ వ్యాఖ్యలతో త్వరలోనే వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ విషయంపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా చేసే అవకాశముంది.
ఇదో సాంకేతిక సమస్య
"గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు పంచాయతీలకు సమాంతర వ్యవస్థలా తయారయ్యాయన్న అభిప్రాయం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ వేరు. సచివాలయ వ్యవస్థ వేరు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. జీతాలు పెంచుదామంటే జీవోలో ఎక్కడా కనబడడం లేదు. గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉన్నట్లు రికార్డులు ఉంటే ఆ వ్యవస్థను రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య" అని పవన్ వివరించారు.
పంచాయతీ నిధులపై ప్రత్యేక శ్రద్ధ
పంచాయతీ నిధులు ఆ పంచాయతీలోనే ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటోందని పవన్‌కల్యాణ్ అన్నారు. పంచాయతీ ఖాతాలను స్తంభింపజేసే గత ప్రభుత్వ అనైతిక విధానాలను తొలగించామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించి, పంచాయతీలకు రూపాయి కూడా ఇవ్వలేదని పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. పంచాయతీలకు త్వరలోనే రూ.750 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు జమవుతాయన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యమిస్తున్నాం. బలంగా ఉండాల్సినచోట ప్రభుత్వం బలంగా ఉంటుందని... మెత్తగా ఉండాల్సినచోట మెత్తగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత తీసుకున్నప్పుడు కొన్నిసార్లు తిట్లు తప్పవన్నారు. సీఎం చంద్రబాబు కూడా విమర్శలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే స్వీకరిస్తారని పవన్‌కల్యాణ్ అన్నారు.