PAWAN: పంచాయతీ నిధులు దారీ మళ్లింపు
డిప్యూటీ సీఎం పవన్‌కు అధికారుల సమగ్ర నివేదిక... కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్;
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ సోషల్ ఆడిట్ అధికారులతో పవన్ సమీక్షా నిర్వహించారు. ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరు, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని అధికారులు పవన్‌కల్యాణ్‌కు వివరించారు. వీటితోపాటు సోషల్ ఆడిట్ సమావేశాలు ఎన్ని గ్రామాల్లో నిర్వహించిందనే వివరాలు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉపాధి మేట్లు పరిధిలో జరిగిన పనులు, వాటి వివరాలు, ఉపాధి హామీ పనుల పురోగతి, నిధులు ఏ మేరకు సద్వినియోగం అయ్యాయి? దుర్వినియోగానికి సంబంధించి నమోదైన కేసుల వివరాలు తెలిపారు. అనంతరం పలు శాఖలపై డిప్యూటీ సిఎం సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ వ్యవస్థలో పూర్తి స్థాయి అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ చట్టాలు, అటవీ చట్టాల గురించి ఆయా శాఖల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చట్టాలకు అనుగుణంగా, పాలనలో ముందుకు సాగాలని, ప్రతి అంశం చట్టపరిధిలో ఉండేలా సమిష్టిగా పనిచేద్దామని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. రక్షిత మంచినీరు, రహదారి కల్పన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి వేయించి నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకుని పనిచేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత వైసీపీ ప్రభుత్వం రూ.5,500 కోట్లు మళ్లించేసిందని... వాటిలో పంచాయతీలకు సంబంధించినవే రూ.3,198 కోట్లు ఉన్నాయని పవన్‌కు అధికారులు తెలిపారు. మిగతా రూ.2,302 కోట్లు జిల్లా, మండల పరిషత్తులకు ఇచ్చినవని వివరించారు. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్తు ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. పవన్‌కల్యాణ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిధుల మళ్లింపు విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన ఈ నిధుల మళ్లింపుపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేయగా, కేంద్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిలోనే నిధులు వేయాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.ఆర్థిక సంఘం నిధుల విషయంలో వైసీపీ ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలను ఉల్లంఘించిందని తేలింది. గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగుకు, పారిశుద్ధ్య పనులకే వాటిని ఖర్చు చేయాలన్న ఆదేశాలకు తిలోదకాలిచ్చింది. పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిల కోసం వాటిని మళ్లించేసింది. కేంద్రం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన రెండు వారాల్లో అవి పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం కానుంది. అలాగే ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి పవన్‌కల్యాణ్ అధికారులను ఆదేశించారు.