LOKESH: నిరుద్యోగులకు లోకేశ్ శుభవార్త

మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు....ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై అధికారులతో మంత్రి సమీక్ష;

Update: 2024-07-03 02:30 GMT

మెగా డీఎస్సీ ఫీజు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సూచించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. టెట్‌, డీఎస్సీ నిర్వహణపై అధికారులతో సమీక్షించిన లోకేశ్‌... కీలక ఆదేశాలు జారీ చేశారు. మెగా డీఎస్సీ, టెట్‌కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని... డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలని లోకేశ్‌ అధికారులకు సూచించారు. పాఠశాలల్లో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీఓ-117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పొరుగుసేవల బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి, వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కూడా లోకేశ్‌ ఆదేశించారు.


మెగా డీఎస్సీలో వయోపరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ తెలిపారు. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎస్జీటీ పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా.. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ప్రైవేటు పాఠశాల అనుమతుల రెన్యువల్‌ విషయంలో అనవసర ఆంక్షలు విధించవద్దని లోకేశ్‌ సూచించారు. టెట్‌ సిలబస్‌లో మార్పు చేయలేదని, సిలబస్‌ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రైవేటు స్కూల్స్ రెన్యువల్‌ విషయంలో అనవసర నిబంధనలు విధించవద్దని మంత్రి లోకేశ్‌ సూచించారు. టెట్‌ సిలబస్‌లో మార్పులు చేసినట్టు వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ముఖ్య‌మంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత‌ మొద‌టి ఐదు సంత‌కాల్లో 16,347 పోస్టుల‌తో మెగా డీఎస్సీ పైన ఒక సంత‌కం చేశారు. ఈ మెగా డీఎస్సీకు మొద‌టి మంత్రి వ‌ర్గం స‌మావేశంలోనే ఆమోదం కూడా తెలిపారు. అప్ప‌టి నుంచి మెగా డీఎస్సీపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఏదీ ఏమైనా జూలై 1 నుంచి డిసెంబ‌ర్ నెలఖారులోపు  మెగా డీఎస్సీ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగానే అధికారులు ఏర్పాట్లు చ‌కచ‌క చేస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీలు, వాటి భ‌ర్తీపై అధికారులు దృష్టి పెట్టారు.

Tags:    

Similar News