AP: వాలంటీర్లకు భారీ గుడ్ న్యూస్..!

పదో తేదీన జరిగే కేబినేట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.. గౌరవం వేతనం రూ. 10 వేలు పెంచడంపైనా నిర్ణయం;

Update: 2024-10-06 03:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు నెలల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తోంది. తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో వాగ్ధానాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెల 10వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్లకు కీలక హామీ ఇచ్చింది. వారికి గౌరవ వేతనం పెంచడమే కాకుండా వారిని విధుల్లో కొనసాగిస్తామని, ఎవ్వరూ రాజీనామా చేయవద్దని హామీ ఇచ్చింది.అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా సరే వారికి జీతాలు పెరగలేదు. వారికి అందిచాల్సిన వేతనాలు కూడా అందలేదు. సీఎం చంద్రబాబు ముందు ఎన్నిసార్లు వాలంటీర్ల ప్రస్తావన వచ్చినప్పటికీ వారికి త్వరలోనే మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్తూ వస్తున్నారు. గత వైసీపీ సర్కార్ వాలంటీర్ల సాయంతోనే అన్ని పథకాలను ప్రజలకు చేరవేసేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారు అయిపోయింది. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు, వాలంటీర్లు కీలకంగా వ్యవహరించిన పెన్షన్ల పంపిణీలో కూడా వారికి పాత్ర శూన్యంగా మారింది.

ఈ కేబినేట్ భేటీలోనే...

ఇటీవలే నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్తామని అన్నారు. దీంతో ఈ వారంలో నిర్వహించే కేబినేట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ప్రస్తావన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో వారికి సంబంధించి మంత్రి వర్గం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు ఏ విభాగంలో విధులకు కేటాయించాలనే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవం వేతనం రూ.10వేలపైన కూడా సీఎం చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. వారికి దీంతో పాటుగా టెక్నికల్ స్కిల్స్ కూడా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో.. టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ కొనుగోలు కోసం వాలంటీర్లకు ప్రతి నెలా ఇచ్చే రూ.200ల భత్యం నిలిపివేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంచుకునేందుకు, ప్రజలకు వివరించేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాలంటీర్లకు పేపర్ భత్యం అందించేవారు. సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న పేపర్ కొనుగోలు చేసేందుకు గానూ ప్రతి నెలా రూ.200 భత్యాన్ని 2.60 లక్షల మంది వాలంటీర్లకు చెల్లిస్తూ వచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ రూ.200 భత్యాన్ని నిలిపివేయనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News