AP: ఏపీలో ఇక ఈ రోడ్లపైనా టోల్ ట్యాక్స్
కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం... తొలి దశలో 18 రోడ్ల అభివృద్ధికి నిర్ణయం;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా సాగుతోంది. మెరుగైన రోడ్ల కోసం వినూత్న ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర రహదారుల్ని కూడా దశల వారీగా పీపీపీ విధానంలో అభివృద్ది చేసి వాటిపై టోల్ గేట్లు పెట్టేందుకు సిద్దమవుతోంది. దీనిపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇలా తొలి దశలో 18, రెండో దశలో 68 రోడ్లూ అభివృద్ధి చేసి టోల్ వసూలు చేస్తారు. రోడ్ల మొత్తం నిర్వహణంతా గుత్తేదారే చూసుకుంటారు. ఇకపై రాష్ట్రంలోని పలు ఆర్‌అండ్‌బీ రోడ్లలో కూడా ఇటువంటి విధానమే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం ద్వారా గుత్తేదార్లకు రోడ్ల నిర్వహణ అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏటా ఆయా రోడ్లలో వర్షాలకు గుంతలు పడితే.. వాటిని పూడ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు కోసం ఎదురుచూడటం, ఐదేళ్లకోసారి రెన్యువల్స్ వేసేందుకు అనుమతులు తీసుకోవడం.. చివరకు రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కల తొలగింపు కోసం కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధుల కేటాయింపునకు వేచి ఉండాల్సి వస్తోంది. ఇటువంటిదేమీ లేకుండా పీపీపీ విధానంలో.. ఆయా రోడ్ల నిర్వహణ బాధ్యతంతా గుత్తేదారే చూసుకుంటారు. వాహన రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారు (స్టేట్ హైవే)ల్లో తొలి విడత 18 రోడ్లను, రెండో విడతలో 68 రోడ్లను ఎంపిక చేశారు.
ఏపీలో దారుణంగా రోడ్లు
ఏపీలో వందల సంఖ్యలో రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వాటి పరిస్ధితి గత ఐదేళ్లలో దారుణంగా మారిపోయింది. వీటిపై వెళ్లాలంటే వాహనాలతో పాటు సాధారణ ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి వాటిపై గుంతల్ని పూడ్చే కార్యక్రమం చేస్తున్న ప్రభుత్వం త్వరలో వీటిని జాతీయ రహదారుల తరహాలోనే ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వాటిని అభివృద్ధి చేయడంతో పాటు టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేయాలని భావిస్తోంది. తొలి దశలో ఇలా 18 రోడ్లను అభివృద్ధి చేస్తారు.
ఎక్కడెక్కడ వేస్తారంటే
అలాగే నరసాపురం-అశ్వారావుపేట మధ్య 100 కిలోమీటర్లు, ఏలూరు-జంగారెడ్డి గూడెం మధ్య 51.73 కిలోమీటర్లు, గుంటూరు-పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు, గుంటూరు-బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు, మంగళగిరి-తెనాలి-నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్లు, బేస్తవారిపేట-ఒంగోలు మధ్య 113.25 కిలోమీటర్లు, రాజంపేట-గూడూరు మధ్య 95 కిలోమీటర్లు, ప్యాపిలి-బనగానపల్లి మధ్య 54.44 కిలోమీటర్లు, దామాజీ పల్లి-నాయినపల్లి క్రాస్-తాడిపత్రి మధ్య 99 కిలోమీటర్లు, జమ్మలమడుగు-కొలిమిగుండ్ల మధ్య 43 కిలోమీటర్లు, సోమందేపల్లి-హిందూపురం-తూముకుంట మధ్య 35.53 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. రెండో విడతలో మరో 68 రోడ్లు ఉన్నాయి. ఆయా రోడ్లలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది? మున్ముందు ఎంత పెరిగే అవకాశం ఉంటుంది? ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు కాకుండా ఇతర వాహనాలకు టోల్ ద్వారా ఎంత వసూలవుతుంది? అవి కాకుండా గుత్తేదారుకు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ కింద ఎంత చెల్లించాల్సి ఉంటుంది అనేవి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.