AP:అమరావతిలో 13 సంస్థల భూ కేటాయింపులు రద్దు
కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. మరో 31 సంస్థల భూ కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయం;
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో 13 సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మరో 31 సంస్థలకు భూ కేటాయింపులను కొనసాగించాలని నిర్ణయించింది. 16 సంస్థల భూములకు లొకేషన్, ఎక్స్‌టెన్షన్ మార్పులు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం అమరావతిపై మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు. గత ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. ఇక, ఆ 13 సంస్థలకు కేటాయించిన భూములను క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాజధానిని పక్కన పడేసిందని ఆరోపించారు. గతంలో అప్లై చేసుకున్న 31 మందికి భూ కేటాయింపులు చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలిగిన తర్వాత పనులు జరుగుతాయి అన్నారు. మరో 16 సంస్థలకు చెందిన భూములకు లొకేషన్, ఎక్స్ టెన్షన్ మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ ఆరోపించారు.
నారాయణ కీలక వ్యాఖ్యలు
‘‘గతంలో 131 మందికి భూములు కేటాయించాం. వాటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. రెండు సంస్థలకు గతంలో కేటాయించిన విధంగా కాకుండా వేరే చోట కేటాయింపులు చేయాలని నిర్ణయించాం. 16 సంస్థలకు స్థలంతోపాటు పరిధిని మార్చాం’’ అని మంత్రి నారాయణ తెలిపారు.
ప్రజలను వైసీపీ మభ్యపెట్టింది: పయ్యావుల కేశవ్
అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్టు అని... మెజారిటీ నిధులను సీఆర్‌డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశామని ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా సపోర్ట్ ఇస్తున్నామని కేశవ్ తెలిపారు. అమరావతి నిర్మాణంలో భాగంగా ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందిన తర్వాత భూములను అమ్మేసి అప్పులన్నీ కట్టే విధంగా డిజైన్ చేశామని తెలిపారు.