Vijayotsava Sabha : యువగళం విజయోత్సవ సభకు ఆటంకాలు

విఫలం చేసేందుకు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం;

Update: 2023-12-19 05:30 GMT

యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసినా... ఆటంకాలు, అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 20న నిర్వహించే జైత్రయాత్ర విజయోత్సవ సభకు... బస్సులు ఇచ్చేందుకు RTC ససేమిరా అంటోంది. ప్రైవేటు బస్ ఆపరేటర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలనూ... ఇవ్వొద్దని రవాణా శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్రా వర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణం ఇచ్చేందుకు వీసీ నిరాకరించారు. అధికారులు.. వైకాపా తొత్తుల్లా మారిపోయారని.. తెలుగుదేశం మండిపడుతోంది.

 తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జైత్రయాత్ర విజయోత్సవ సభకు.. అవరోధాలు కల్పించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో... సభ విజయవంతం కాకుండా చూసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ అధికారులు... సభకు పూర్తి సహాయ నిరాకరణ చేస్తున్నారు.

సభకు ఆర్టీసీ యాజమాన్యం బస్సులు ఇచ్చేందుకు ససేమిరా అంది. చివరకు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలపై కూడా ప్రభుత్వం ఒత్తిడితెస్తోంది. తెదేపా సభకు బస్సులు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సంబంధిత శాఖల అధికారులతో హెచ్చరికలు చేయిస్తోంది. వైకాపా సభలకు కోరిన వెంటనే వందలకొద్దీ బస్సులు కేటాయిస్తున్న అధికారులు... విపక్షాల సభలకు బస్సులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. 2022లో ఒంగోలులో, ఈ ఏడాది మేలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన తెదేపా మహానాడు సభలకూ బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ తిరస్కరించింది. యువగళం విజయోత్సవ సభకు తెదేపా కోరిన వెంటనే... రైల్వేశాఖ ఐదు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. 

 పాదయాత్ర విజయోత్సవ సభను మొదట విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించాలని భావించిన తెలుగుదేశం... వీసీని అనుమతి కోరుతూ లేఖ రాసింది. దానిపై ఎటూ తేల్చకుండా నాన్చిన వీసీ... చివరకు ఆర్గానిక్‌ మేళా జరుగుతోందన్న సాకుతో అనుమతి నిరాకరించారు. ఆర్గానిక్‌ మేళా ఈ నెల 17తోనే ముగిసింది. దీన్నిబట్టి అది కేవలం సాకేనని స్పష్టమవుతోంది. మతపరమైన కార్యక్రమాలకు విద్యా సంస్థల ఆవరణలో అనుమతివ్వరాదని జీవో ఉన్నా అదే ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్‌లో వైకాపా అధికారంలోకి వచ్చాక వివిధ మతపరమైన కార్యక్రమాలకూ అనుతులిచ్చారు. అప్పుడు ఈ జీవోలు గుర్తుకు రాలేదా? అని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. 

ఎన్ని అడ్డంకులు సృష్టించినా... సభను విజయవంతం చేస్తామని... తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరిగే యువగళం విజయోత్సవ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ సహా ఇరుపార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. ఈ సభావేదికపై నుంచే ఇరు పార్టీల అధినేతలు సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఉంది. 110 ఎకరాల స్థలంలో నిర్వహించే విజయోత్సవ సభలో... సుమారు 6 లక్షల మంది పాల్గొంటారన్న అంచనాతో.. అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు

Tags:    

Similar News