AP: కొత్త విమానాశ్రాయాలపై ఏపీ సర్కార్ దృష్టి
విమానాశ్రయ పనులు మరింత వేగవంతం...తదుపరి కార్యాచరణకు ఏపీ సర్కార్ సిద్ధం...దగదర్తి విమానాశ్రయ భూముల్లో డ్రోన్ సర్వే
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల అభివృద్ధికి వేగం పెరిగిందనే వాదనను బలపరిచే మరో ముందడుగు పడింది. రాజధాని అమరావతి పునర్నిర్మాణంతో పాటు రహదారులు, రైల్వేలు, విమాన మార్గాల అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలనే వ్యూహంతో ప్రభుత్వం కదులుతోంది. ఆ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ప్రతిపాదిత దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించి కీలక సాంకేతిక సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమం చేసే కీలక దశగా అధికారులు పేర్కొంటున్నారు. దగదర్తి విమానాశ్రయం ప్రతిపాదన చాలా ఏళ్లుగా చర్చల్లో ఉన్నప్పటికీ, కార్యరూపం దాల్చలేదు. భూ సేకరణ ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో, ఇప్పుడు సాంకేతిక అనుమతుల దిశగా చర్యలు వేగవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం భూములను మళ్లీ సమగ్రంగా పరిశీలించింది. ముఖ్యంగా ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్ఫేసెస్ (ఓఎల్ఎస్) సర్వేను డ్రోన్ సాంకేతికతతో నిర్వహించడం ఈ దశలో ప్రాధాన్యం సంతరించుకుంది.
అత్యంత కీలక సర్వే
ఓఎల్ఎస్ సర్వే అనేది విమానాశ్రయ నిర్మాణానికి అత్యంత కీలకమైన దశగా భావిస్తారు. విమానాల రాకపోకలకు అడ్డంకులుగా మారే భౌగోళిక లేదా నిర్మాణ సంబంధ అంశాలు ఉన్నాయా? ఎత్తైన కొండలు, విద్యుత్ టవర్స్, నీటి వనరులు, కాలువలు లేదా ఇతర నిర్మాణాలు విమాన ప్రయాణ భద్రతపై ప్రభావం చూపుతాయా? వంటి అంశాలను ఈ సర్వే ద్వారా సమగ్రంగా పరిశీలిస్తారు. డ్రోన్ సాంకేతికత ఉపయోగించడం వల్ల భూభాగం యొక్క ఎత్తుపల్లాలు, పరిసర నిర్మాణాల ఖచ్చితమైన మ్యాపింగ్ సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం దగదర్తి ప్రాంతాన్ని ప్రాథమికంగా పరిశీలించింది. ఆ సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్టు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రతిపాదిత విమానాశ్రయ భూములకు పడమర వైపున కొండ ప్రాంతం ఉండటం, ఉత్తర దిశలో చెరువు ఉండటం, అలాగే దగదర్తి–ముంగమూరు కాలువలు భూభాగాన్ని దాటుతూ ఉండటం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. ఈ మూడు అంశాలు భవిష్యత్తులో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియలకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని అప్పట్లో ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు.