ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు

బ్యాంకుల ముందు చెత్తవేసిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉయ్యూరు కమిషనర్‌ ప్రకాశరావును సస్పెండ్‌ చేసింది.

Update: 2020-12-28 02:30 GMT

కృష్ణాజిల్లా ఉయ్యూరుతో పాటు విజయవాడ నగరంలో 16 బ్యాంకు శాఖల ముందు మున్సిపల్ సిబ్బంది చెత్త వేయడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలివ్వడానికి కొన్ని బ్యాంకులు ముందుకు రావడంలేదని.. దీనికి నిరసనగా మున్సిపల్ అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ ప్రకాశరావు అయితే ఒక అడుగు ముందుకేసి పీఎం స్వానిధి, జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత పథకాలను రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఈ విధంగా చెత్తను వేసినట్టుగా బ్యాంకు గేట్లకు ప్రత్యేకంగా తన పేరుతో బోర్డులు పెట్టించారు.

బ్యాంకుల ముందు చెత్తవేసిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉయ్యూరు కమిషనర్‌ ప్రకాశరావును సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు ముందు కమిషనర్‌ మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బంది, లబ్ధిదారులు కలిసి బ్యాంకుల ముందు చెత్తవేయడం బాధాకర అంశమని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని.. ఈ విషయంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది మనోభావాలు దెబ్బతిని ఉంటే తాను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు.

అయితే ప్రకాశరావు క్షమాపణ చెప్పిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం గమనార్హం. మరోవైపు ఈ తరహా ఘటనపై మచిలీపట్నం, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్లను ప్రభుత్వం వివరణ కోరింది.


Tags:    

Similar News