ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు
హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేతలు అప్పీల్‌కు వెళ్లనుండటంతో ఉత్కంఠ నెలకొంది.;
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు వేసింది.. రేపు జరగాల్సిన కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఏడు పంచాయతీల విలీనంపై దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది.. మరోవైపు హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేతలు అప్పీల్‌కు వెళ్లనుండటంతో ఉత్కంఠ నెలకొంది.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు సజావుగా జరుగుతాయా అన్నదానిపై మొదటి నుంచి అనుమానాలే.. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడగా.. ఇప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడంతో మరోసారి వాయిదా పడ్డాయి. ఏలూరు కార్పొరేషన్‌లో ఏడు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు రూరల్ గ్రామాల ప్రజలు. వార్డులను డివిజన్లలో విలీనం చేసే ప్రక్రియ సరిగా లేదని, జనగణన, కుల గణన, ఓటర్ల లిస్టులో అక్రమాలు ఉన్నాయంటూ పిటిషన్లు వేశారు. ఎన్నికలు జరిగేందుకు అవసరమైన పరిస్థితి ఏలూరులో లేదని, అధికార యంత్రాంగం దీనిని సవరించిన తరువాత ఎన్నికలు చేపట్టాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గత ఏడాది మార్చి 13న విలీనంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కుల, జన గణన చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే, అప్పుడు లాక్ డౌన్ కారణంగా ఎన్నికలు వాయిదా పడినప్పటికీ.. ఆ అభ్యంతరాలు కొనసాగుతుండగానే మళ్లీ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ పిటిషనర్లు గత నెల 14న హైకోర్టును ఆశ్రయించారు. అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని.. 65వేల మంది జనాభాను కార్పొరేషఫన్‌లో విలీనం చేయడం వల్ల 10వేల మంది కార్మికులు గ్రామీణ ఉపాధి కోల్పోతారని జనసేన నేత అప్పలనాయుడు ఆరోపించారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత పంచాయతీల విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని చెబుతున్నారు.
అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లాలనుకుంటోంది. న్యాయ నిపుణుల సలహా అనంతరం పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది.. దీనిపై ఈరోజు స్పష్టత రానుంది. అటు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడినప్పటికీ.. జిల్లాలోని కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం మునిసిపాల్టీలకు ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి.