లోకేష్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
ఏపీలో ఎలక్షన్ లేదు.. వైసీపీ సెలక్షన్ ఉందని విమర్శించారు లోకేష్.;
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా గొల్లప్రోలులో పర్యటించిన లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
ఏపీలో ఎలక్షన్ లేదు.. వైసీపీ సెలక్షన్ ఉందని విమర్శించారు. పెంచుకుంటూ పోతానని చెప్పిన జగన్.. అన్ని రేట్లను మాత్రం పెంచుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు. పాదయాత్రలో విసిరిన ముద్దులు ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని ప్రజలను హెచ్చరించారు.
అనంతరం పిఠాపురంలో ఆయన పర్యటించారు. పింఛన్ పెంచుకుంటా పోతానని చెప్పి రేట్లు పెంచుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్, గ్యాస్ ధరలు విపరతీతంగా పెంచారని.. త్వరలోనే ఆస్తి పన్ను కూడా పెంచడానికి సిద్ధమయ్యారని లోకేష్ తెలిపారు. వైసీపీ అరాచక పాలనని అంతం చేద్దాం.. అభివృద్ది టీడీపీని గెలిపించుకుందామని ప్రజలను కోరారు.
పర్యటన మొత్తం లోకేష్ కు ప్రజలు, మహిళలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. లోకేష్ పర్యటనతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది.