AP; ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరణ
ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ చర్చలు సఫలం.. ఆందోళన విరమించిన ప్రైవేటు ఆస్పత్రులు.. తిరిగి ప్రారంభమైన ఎన్టీఆర్ వైద్య సేవలు... బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం హామీ
ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా నిలిచిన ఎన్టీఆర్ వైద్యసేవల పునరుద్దరణకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విజవంతమయ్యాయి. వైద్య సేవలను నిలిపిన ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నిలిచిన ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవలు ఈ రోజు నుంచే తిరిగి ప్రారంభమయ్యాయి. బకాయిలు అన్నింటినీ చెల్లించేందుకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులు ప్రకటించారు.
రూ.250 కోట్లు వెంటనే విడుదల
ఎన్టీఆర్ వైద్య సేవల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ నెట్ వర్క్ ఆస్పత్రులు గత 20 రోజులుగా ఆందోళన చేపడుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల సమ్మెతో ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా 250 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయించింది. మిగతా బకాయిల మొత్తాన్ని కూడా విడతల వారీగా విడుదల చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు హామీ ఇచ్చింది. అయినప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ సమ్మె కొనసాగించింది. దీంతో బకాయిలు మొత్తం వన్ టైం సెటిల్మెంట్ కింద నవంబర్ చివరికల్లా చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులు సమ్మె విరమించాయి. ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి రూ.2,700 కోట్లు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను యాజమాన్యాలు నిలిపివేశాయి. ఈ డిమాండ్‌తో గత 20 రోజులుగా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు అసోషియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన ప్రభుత్వం రూ.250 కోట్లు చెల్లింపులు చేసింది. వెలగపూడిలోని సచివాలయంలో ఆస్పత్రుల అసోషియేషన్ ప్రతినిధులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశమై సమగ్రంగా చర్చించారు. మరోవైపు బిల్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ పదో తేదీ నుంచి సమ్మె జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 841 నెట్వర్క్ ఆసుపత్రులు ఉంటే.. సుమారుగా 467 ఆసుపత్రులు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. వీటిలో కొన్ని ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్యసేవ ఓపీ నిలిపివేశాయి, కేవలం అత్యవసర సేవలే అందించాయి. మరికొన్ని ఆస్పత్రులు అత్యవసర సేవలతో పాటుగా ఓపీలను కూడా నిలిపివేశాయి.
మంత్రి హామీ..
ఇన్సూరెన్స్‌తో ప్రైవేటు ఆస్పత్రులకు ఎక్కడా అన్యాయం జరగదని, వారి సహకారంతోనే ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. చికిత్సలకు చెల్లించే మొత్తాలను పెంచే అంశంపైనా చర్చించారు. ప్రైవేటు ఆస్పత్రుల సహకారం, భాగస్వామ్యంతోనే ఇన్సూరెన్స్ విధానం అమలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం సమస్యలను ప్రభుత్వం పరిష్కారానికి హామీ ఇచ్చినందుకు తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆశా ప్రతినిధులు ప్రకటించారు. ఈ చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవల బకాయిలు సుమారుగా రూ.2,700 కోట్ల వరకూ ఉన్నాయి. దీంతో ఈ బకాయిలను చెల్లించాలని ప్రైవేట్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగాయి.