AP: పాస్ పుస్తకాలలో క్యూ ఆర్ కోడ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం;
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా భూమి హక్కులపై పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాస్ పుస్తకాల్లో QR కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఆయన ఆదేశించారు. దీని ద్వారా ప్రతి భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండనుంది. ఈ ఆధునికీకరణతో భూ సంబంధిత మోసాలను అరికట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు 15 నుంచి కొత్తగా ముద్రించిన QR కోడ్ పాస్‌పుస్తకాలను ఉచితంగా పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలన్నది సీఎం ఆదేశం. అమరావతిలోని సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పేదల భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి 10 అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. భూమి వారసత్వ సర్టిఫికెట్ల విషయంలో కూడా ప్రభుత్వం ప్రగతిశీల నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షల లోపు విలువగల భూముల వారసత్వ సర్టిఫికెట్లు గ్రామ సచివాలయాల్లో కేవలం రూ.100 చెల్లించి పొందేలా వెసులుబాటు కల్పించనుంది. రూ.10 లక్షల పైబడి విలువైన భూములకు రూ.1000 ఫీజుతో సెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేయనుంది. ఈ నిర్ణయాలతో సామాన్య రైతులకు, భూమి వారసులకు భూ హక్కులపై స్పష్టత లభించనుండగా, రెవెన్యూ శాఖలో పారదర్శకత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. భూముల [రీ సర్వే ](https://telugu.hindustantimes.com/andhra-pradesh/land-prices-are-increasing-again-in-amaravati-121718278403820.html)పేరుతో గత ప్రభుత్వం పొలాల సర్వే చేయించిదని, ఇందుకోసం భారీగా నిధులు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
శ్రావణ మాసంలో 3 లక్షల పేదల గృహప్రవేశాలు
ఏపీ ప్రభుత్వం పేదలకు గృహ కలను నెరవేర్చేందుకు శ్రావణ మాసాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే శ్రావణంలో 3 లక్షల ఇళ్లను పూర్తిచేసి, గృహప్రవేశాలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే సుమారుగా లక్ష మందికి రూ.300 కోట్లు మంజూరు చేయగా, 50 వేల మందికి ఇళ్ల నిర్మాణం పునఃప్రారంభమైంది. గత 13 నెలల్లో 2.30 లక్షల ఇళ్లు పూర్తి కాగా, 87 వేల ఇళ్లు రూఫ్ స్థాయికి, 1.2 లక్షల ఇళ్లు లింటెల్ స్థాయికి, 50 వేల ఇళ్లు బేస్‌మెంట్ వరకు నిర్మితమయ్యాయి. మిగిలిన నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తోంది. ప్రతి ఇంటికి కేంద్రం రూ.1.50 లక్షలు, ఉపాధి హామీ కింద రూ.30 వేలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 అదనంగా అందిస్తోంది. అంతేకాక, ఎస్సీలకు ₹50,000, బీసీలకు ₹50,000, ఎస్టీలకు ₹75,000, గిరిజనులకు ₹1,00,000 అదనపు నిధులు అందిస్తుంది. ఇందులో భాగంగా 'అందరికీ ఇళ్లు' కార్యక్రమానికి ఊపందిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమిని అందించేలా చర్యలు తీసుకుంటోంది. కేటాయించిన ప్లాట్లకు 10 ఏళ్ల ఫ్రీ హోల్డ్ హక్కులతో కూడిన కన్వేయన్స్ డీడీను అందించనుంది. ఇంటి స్థలం పొందిన వారు 2 సంవత్సరాల్లోగా నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది. జీవితంలో ఒక్కసారే ఉచిత స్థలం ఇవ్వబడుతుందని నిబంధనల ద్వారా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పేదలకు తలదాల్చుకునే గొడుగు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 'అందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని అందించే అంశంపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అందరికీ ఇళ్లు అనే ప్రాతిపదికన కేటాయించిన ప్లాట్లకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ జారీ చేస్తుందని ఉత్తర్వులో వెల్లడించారు.