AP: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసులు
తెనాలిలో ఆరు స్క్రబ్ టైఫస్ కేసులు... అన్నమయ్య జిల్లాలో 39 మందికి పాజిటీవ్... కలవరపాటుకు గురవుతున్న ప్రజలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ జ్వర కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 22 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచారు. ఆసుపత్రి బీ క్లాస్ విభాగంలో 14 పడకలతో స్క్రబ్ టైఫస్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్డు మొత్తం రోగులతో నిండిపోయింది. ఇంకా మిగిలిన వారిని ఇతర వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. చికిత్సల కోసం వస్తున్న జ్వర బాధితులందరికీ స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. అదేవిధంగా మలేరియా, డెంగీ పరీక్షలు కూడా చేయిస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో పలు చోట్ల పారిశుధ్యం క్షీణించి.. స్క్రబ్ టైఫస్ కారక చిగ్గర్ మైట్స్ (పేడ పురుగులు) సంఖ్య బాగా పెరిగినట్లు వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెరిగిన మైట్స్ వల్ల పలువురు ఈ జ్వరాల బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆరు స్క్రబ్ టైఫస్ కేసులు బయటపడ్డాయి. వారందరికీ చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఆదివారం తెలిపారు. స్క్రబ్ టైఫస్ బాధితుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం చికిత్స పొందుతున్న ఒకరి ఆరోగ్యం మెరుగవ్వడంతో డిశ్చార్జ్ చేశామని చెప్పారు.
అన్నమయ్య జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కల్గిస్తోంది. అన్నమయ్య జిల్లా పరిధిలో ఇప్పటికి 289 నమూనాలను సేకరించగా 39 మందికి పాజిటివ్ రావడంతో జిల్లా ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. రెండు రోజుల కిందట సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థి, కేవీ పల్లె మండల పరిధిలో మరో వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కావడంతో తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం. స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
అధికశాతం మందికి ఈ వ్యాధిపై అవగాహన లేదు. అధికారులు దీనిపై విస్తృతంగా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది సాధారణ జ్వరం లాంటిదైనప్పటికీ ఆలస్యం చేస్తే శరీరంలో అంతర్గత అవయవాలపై ప్రభావం చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు మండల పరిధిలో ల్యాబ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. .
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ.....
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే అదనుగా భారీగా సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా సమయంలో ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. సాధారణ జ్వరాన్ని స్క్రబ్ టైఫస్ అని భయాందోళనకు గురిచేస్తూ పేదల నుంచి డబ్బు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన ల్యాబ్, మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.