ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వినియోగంపై కీలక చర్చ మొదలైంది. ముఖ్యంగా చిన్నారుల భద్రత, వారి మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీశాయి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఈ అంశంపై మాట్లాడారు. చిన్న వయస్సులో పిల్లలు సోషల్ మీడియా కంటెంట్‌ను సరైన రీతిలో అర్థం చేసుకోలేరని, అది వారి ఆలోచనా విధానంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పిల్లలను రక్షించేందుకు కఠినమైన చట్టాలు అవసరమని స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా తరహా చట్టం
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే అవకాశాలపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే చిన్నారుల కోసం సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఏపీలోనూ పిల్లలకు హానికరంగా మారుతున్న డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇది నిషేధమా? నియంత్రణా? అన్నది ఇంకా తుది దశకు రాలేదని, అయితే పిల్లల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వల్ల చిన్నారుల్లో మానసిక ఒత్తిడి, వ్యసనాలు, దారి తప్పే ఆలోచనలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు సమాచారం, హింసాత్మక కంటెంట్, అసభ్య వీడియోలు, సైబర్ బుల్లీయింగ్ వంటి అంశాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.