AP: రాజధాని పేరుతో మూడు ముక్కలాట
వైసీపీ పాలనలో అమరావతిలో భారీ విధ్వంసం.. విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్న ఏపీ సర్కార్... శాసనసభలో అమరావతిపై మంత్రి సమాధానం
అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని శాసనసభ వేదికగా పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అమరావతిలో సీఆర్డీఏ నుంచి 21 పనులు, ఏడీసీ నుంచి 64 పనులు చేపట్టారన్నారు. రాజధాని కోసం 35,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా తీసుకున్నామని వెల్లడించారు. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి మూడుముక్కలాట ఆడిందని మండిపడ్డారు. అమరావతిలో చెట్లు తొలగించేందుకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని వివరించారు. రాజధాని నిర్మాణ పనుల్లో ప్రస్తుతం 10 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి మూడు ముక్కలాట ఆడిందని.. దీంతో అమరావతిలో అడవిలా పెరిగిన చెట్లను తొలగించేందుకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, లే అవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జీల బంగ్లాలు, అధికారులు, ఉద్యోగుల నివాసాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. మార్చి 31 నాటికి 3,500 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును పరిశీలిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
వైసీపీ విధ్వంసం అంతా ఇంతా కాదు
అమరావతిలో వైసీపీ కుట్రల వల్ల జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామని అసెంబ్లీలో మంత్రి నారాయణ వెల్లడించారు. గతంలో పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లు ఇప్పుడు ముందుకు రాలేదని... మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చిందన్నారు. హడ్కో, ప్రపంచ బ్యాంకు ద్వారా రాజధాని నిర్మాణానికి రుణాలు తీసుకున్నామని వెల్లడించారు. పనులు ప్రణాళికబద్ధంగా జరుగుతున్నాయని... పనులు పూర్తయ్యాక ప్రధానిని పిలిచి ప్రారంభోత్సవం చేస్తామన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అనుమతుల ప్రక్రియ సులభతరం చేశామని, పెట్టుబడి దారులకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చామని తెలిపారు. అమరావతి రూపుదిద్దుకుంటున్న దిశలో ఈ ప్రదర్శన ఒక పెద్ద మైలురాయి అవుతుందని తెలిపారు. అమరావతి త్వరలోనే దేశంలోనే అందమైన నగరంగా నిలుస్తుందని ఇక్కడ పెట్టుబడి పెట్టే వారికి మంచి భవిష్యత్ ఉంటుందని వివరించారు. అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టే దిశగా ముందుకు సాగుతున్నామని నారాయణ వెల్లడించారు.
రెండు బిల్లులను ఆమోదించిన అసెంబ్లీ
సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ సవరణ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అన్ని పార్టీల నేతలు ప్రసంగించి తమ అభిప్రాయాలను సభ దృష్టి తీసుకొచ్చారు. దీంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు గ్రామ, వార్డు సచివాలయ బిల్లును ఆమోదం పొందినట్లుగా ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాలను జనాభా ఆధారంగా ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించింది. ఈ విభజన సిబ్బంది కేటాయింపు, సేవల సమర్థతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను రియల్‌టైం గవర్నెన్స్ కార్యాలయాలుగా మార్చాలని, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ అభివృద్ధి, ఉపాధి కల్పన, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని, రాజకీయ చిహ్నాలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు కీలక మలుపు
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామని.. రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. అమరావతిలో బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించాలని.. ఇప్పటికే స్థలాలు కూడా కేటాయించామని చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం పెంచాలని కోరారు. విజయవాడలో జరిగిన లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశం తర్వాత బ్యాంకుల ఛైర్మన్లు, సీఎండీలు... చంద్రబాబుతో భేటీ అయ్యారు.అమరావతిలో చేపడుతున్న ప్రాజెక్టులు, రోడ్ మ్యాప్‌పై సీఎం వారికి సమగ్ర వివరాలందించారు. 15 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రగతి ప్రణాళికల గురించి చెప్పారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హార్బర్లు, జాతీయ రహదారులు, క్వాంటమ్ వ్యాలీ తదితర పనుల పురోగతిని తెలియజేశారు. వ్యవసాయం, విద్యుత్తు, నీటిపారుదల, విద్య, వైద్య రంగాలతోపాటు పౌరసేవల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామన్నారు. రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.