ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లీగ్ సీజన్ 4 కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఆరంభమైంది. విశాఖలోని ఓ హోటల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి వేలంలో ఏడు జట్లు బరిలోకి దిగాయి. ఇందులో భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, విజయవాడ సన్‌షైనర్స్, కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ ఉన్నాయి. దాదాపు 500 మందికి పైగా క్రీడాకారులు వేలంలోకి వస్తున్నారు. ఒక జట్టులో గరిష్ఠంగా 20 మందిని లేదా కనిష్ఠంగా 18 మందిని తీసుకోవచ్చు. ఇక వేలానికి ముందు ఏడు జట్లు మొత్తంగా ఎనిమిది మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. వారిలో రికీ భుయ్ (సింహాద్రి వైజాగ్ లయన్స్), షేక్ రషీద్ (రాయల్స్ ఆఫ్ రాయలసీమ), అశ్విన్ హెబ్బార్ (విజయవాడ సన్‌షైనర్స్), కేఎస్ భరత్ (కాకినాడ కింగ్స్), నితీశ్ కుమార్ రెడ్డి (భీమవరం బుల్స్), హనుమ విహారి (అమరావతి రాయల్స్), శశికాంత్, స్టీఫెన్ (తుంగభద్ర వారియర్స్) ఉన్నారు.
వేలంలో పైల అవినాశ్ - ₹11.5 లక్షలు (రాయల్స్ ఆఫ్ రాయలసీమ), పి.గిరినాథ్ రెడ్డి - ₹10.5 లక్షలు (రాయల్స్ ఆఫ్ రాయలసీమ), పీవీ సత్యనారాయణ రాజు - ₹9.8 లక్షలు (భీమవరం బుల్స్) ధర పలికారు. ఎస్డీఎన్ వర ప్రసాద్ -₹9.5 లక్షలు (అమరావతి రాయల్స్), సౌరభ్ కుమార్ - ₹ 8.8 లక్షలు (తుంగభద్ర వారియర్స్), వై.పృథ్వీరాజ్ - ₹8.05 లక్షలు (విజయవాడ సన్‌షైనర్స్), త్రిపురాన విజయ్ - ₹ 7.55 లక్షలకు (సింహాద్రి వైజాగ్ లయన్స్) ఆయా ప్రాంఛైజీలు దక్కించుకున్నాయి.