PERNI NANI: పోలీస్స్టేషన్లో పేర్ని నాని దాదాగిరి
పేర్ని నానిపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో దాదాగిరి ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇటీవల పేర్ని నాని నేతృత్వంలో వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టాయి. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టడంతో పేర్నితో పాటు 400 మందికి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వొద్దని వైసీపీ మచిలీపట్నం అధ్యక్షుడు మేకల సుబ్బన్న పార్టీ వాట్సప్ గ్రూప్లో పోస్టు చేశారు. కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. విషయం తెలుసుకున్న పేర్నినాని కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకుని.. ఆర్పేట సీఐతో వాగ్వాదానికి దిగారు. తమ పార్టీ కార్యకర్తలను స్టేషన్కు ఎందుకు పిలుస్తున్నారని ఆగ్రహంతో రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పేర్ని నాని వ్యవహార శైలితో విస్తుపోయిన పోలీసులు.. స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తప్పవు
ఆర్పేట సీఐ విధులకు ఆటంకం కలిగించేలా మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ నిరసన కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకోవడానికి వచ్చి, సీఐని బెదిరించడం, దురుసుగా మాట్లాడటం సరికాదని ఎస్పీ ఖండించారు. నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.