ATTACK: మహా న్యూస్ ఛానల్‌పై దాడిని ఖండించిన ముఖ్యమంత్రులు
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఆస్కారం లేదని స్పష్టీకరణ;
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మహా న్యూస్ టీవీ ఛానల్‌పై బీఆర్ఎస్కు చెందిన కొంతమంది కార్యకర్తలు దాడి చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వార్తలు ప్రసారం చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మహాన్యూస్ ఛానెల్ మీద దాడి జరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో.. హీరో సుహాస్ మహా న్యూస్ ఛానెల్ స్టూడియోలో ఉన్నట్లు తెలిసింది. ఓ చిత్ర ప్రమోషన్ కోసం సుహాస్ మహాన్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఈ సమయంలోనే దాడి జరగ్గా.. సుహాస్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడంతో ఇలా దాడి చేస్తారని మహా న్యూస్ వర్గాలు కూడా అనుకోలేదు. దాంతో పెద్దగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోలేదు. దాంతోదాడి చేసిన వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయినట్లయింది.
తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఎలాంటి స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. మీడియా సంస్థలపై దాడి చేయడం అత్యంత దారుణమైన చర్యగా అభివర్ణించారు. బెదిరింపులు, బలవంతపు చర్యలతో మీడియా స్వేచ్ఛను ఆపాలనే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని స్పష్టం చేశారు. ఈ దాడిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. "మీడియా సంస్థలు ప్రసారం చేసే కథనాలపై అభ్యంతరాలు ఉంటే, వాటిని వ్యక్తీకరించేందుకు చట్టబద్ధమైన, ప్రజాస్వామ్య మార్గాలున్నాయన్నారు. కానీ నేరుగా భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత గర్హనీయమైన చర్య" అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని, మీడియా గొంతు నొక్కే యత్నాలను ఏ ఒక్కరూ సహించకూడదని పిలుపునిచ్చారు.
మహా న్యూస్‌పై దాడి దుర్మార్గం: సీఎం
హైదరాబాద్‌లోని మహాన్యూస్ చానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన హేయ చర్యగా అభివర్ణించారు. మీడియా సంస్థలపై ఇలాంటి దాడులు ఎవరూ సమర్థించలేనివని ఆయన X ద్వారా వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదని పేర్కొన్నారు.