BALAYYA: వైఎస్ జగన్ ఓ సైకో: బాలకృష్ణ
శాసనసభలో బాలయ్య తీవ్ర ఆగ్రహం.. కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలకు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. తీవ్ర దుమారం చెలరేగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో సభలో చర్చకు వచ్చిన అంశం.. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలోని సభ్యుల మధ్య జరిగిన చర్చలోనే తీవ్ర వివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామినేని చేసిన వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేశారు. గతంలో వైసీపీ హాయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు.. సినిమా ఇండస్ట్రీ పెద్దలు వెళ్లిన విషయంలో.. చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను సైకో అంటూ బాలకృష్ణ సంబోధించడం తీవ్ర దుమారానికి కారణం అయింది. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగి వచ్చారన్నది అబద్ధమని చెప్పారు. ఎవరూ గట్టిగా అడగలేదని తెలిపారు. అయితే తనను కూటమి ప్రభుత్వం కూడా అవమానించిందని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. అదే సమయంలో చిరంజీవిపైనా పరోక్ష విమర్శలు చేశారు.
ఎఫ్డీసీ సమావేశంలో తన పేరు తొమ్మిదివ స్థానంలో పెట్టారని, ఆ లిస్ట్ తయారు చేసింది ఎవరంటూ ప్రశ్నించారు. తనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేశ్‌కు ఫోన్ చేసి అడిగానని బాలకృష్ణ తెలిపారు. సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ సినిమా ఇండస్ట్రీని, సినీ పెద్దలను పట్టించుకోలేదని కామినేని శ్రీనివాసరావు ఆరోపించారు. అంతేకాకుండా చిరంజీవిని.. గతంలో జగన్ అవమానించారని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ సహా పలువురు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు వెళ్లగా.. వారిని గేటు వద్దే ఆపేశారని.. సీఎం కాకుండా సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి కలుస్తారని చెప్పినట్లు మాజీ మంత్రి కామినేని వెల్లడించారు. అయితే ఆ సమయంలో చిరంజీవి సీరియస్ అయి.. గట్టిగా మాట్లాడటంతో జగన్ వచ్చి మాట్లాడినట్లు తెలిపారు. అదే సమయంలో చిరంజీవి గట్టిగా నిలదీయలేదని పేర్కొనడం గమనార్హం. అదే సమయంలో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా తనను అవమానించిందని బాలకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) సమావేశంలో తన పేరును 9వ స్థానంలో పెట్టారని.. బాలకృష్ణ ఫైర్ అయ్యారు.