BATHUKAMMA:"మన బతుకమ్మ"కు రెండు గిన్నీస్ రికార్డులు
సరూర్‌నగర్‌లో ఘనంగా మన బతుకమ్మ.. అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నీస్ రికార్డు.. అతిపెద్ద బతుకమ్మగా మరో గిన్నీస్ రికార్డు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్‌నగర్ స్టేడియంలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 63 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మన తెలంగాణ బతుకమ్మ రెండు విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. బతుకమ్మ సంబరాల్లో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడారు.
మెరిసిన మిస్ వరల్డ్ ఓపల్ సుచాతా
మన బతుకమ్మ సంబరాలు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ స్టేడియం అంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈసారి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాతా చువాంగ్శ్రీ పాల్గొన్నారు. మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మితో కలిసి సుచాతా బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించిన మిస్ వరల్డ్, ఇతర విదేశీయులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, ఆడపడుచుల బతుకమ్మల ఆటలతో స్టేడియం మారుమ్రోగిపోయింది.
63 అడుగుల ఎత్తైన బతుకమ్మ
వేదికపై 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పుతో, 7 టన్నుల బరువుతో రూపొందించిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూలతో అలంకరించిన ఈ బతుకమ్మను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. ప్రకృతిని ఆరాధించే ఈ వేడుకలో మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ వేడుకలో ఒకేసారి 1354 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ క్రమంలోనే గిన్నిస్ రికార్డును కూడా సాధించారు. అతి పెద్ద జానపద నృత్యం (బతుకమ్మ ఆడి) గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది. ఈ ఘనతతో మహిళా శక్తి, తెలంగాణ ఐక్యత ప్రపంచ వేదికపై వెలుగొందింది.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు. తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ వేడుకలతో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ పరిసరాలు వెలుగులీనాయి. వందలాది మంది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడిపాడారు. హనుమకొండ, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మహిళలంతా సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. దేవాలయాలు, పాఠశాలలు, వాడవాడల, చెరువు సమీపంలోని ఆట స్థలాల వద్ద, రోడ్ల వెంబడి విద్యుత్ దీపాలతో పాటు కలర్ పేపర్లతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.