BETTING: ఆన్‌లైన్ బెట్టింగ్ మాయ.. మానవ మేధకు ముప్పే!
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న యువత ఆత్మహత్యలు;
ప్రతి రోజూ ఊహించని విధంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత కథలు ఒకటే వేదనను వినిపిస్తున్నాయి – ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్ బాధలు. ఒక్క క్లిక్‌తో లక్షలు పోగొట్టుకున్న తరం, అప్పుల్లో కూరుకుపోయి మానసికంగా కుంగిపోతున్న తరం ఇది. జూదం అనే మత్తు ఎంత ప్రమాదకరమో తెలియక యువత తిప్పలు పడుతోంది. నేరాలు పెరుగుతున్నాయి. ప్రాణాలు పోతున్నాయి. ఈ ఆటలు ఆడే యాప్‌లు యంత్రాంగాలకే యాక్సెస్ అవటం లేదు. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా స్పందిస్తోంది.
ఏకగామి పాలసీ లేకపోవడం ప్రధాన సమస్య. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో ఒక్క నియంత్రణ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి యాప్‌లను నిర్బంధించేందుకు ప్రత్యేక చట్టాలు, నిబంధనలు అవసరం. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సామాజిక వేదికలు యువతలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్ లోన్ యాప్‌ల చుట్టూ తిరుగే బలహీన వర్గాలకు మద్దతు కల్పించాలి. శిక్షల కంటే ముందుగా – సరైన దారిని చూపించాలి. అప్పుడే ఈ బెట్టింగ్ మృగం నియంత్రణలోకి వస్తుంది. ఇక విషాన్ని వెదజల్లే యూట్యూబ్ ఛానళ్లు, టెలిగ్రామ్ గ్రూపులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లువెన్సర్లు కూడా ఈ బెట్టింగ్ మత్తుకు ఇంధనం పోస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న యువత ఆత్మహత్యలు"డబ్బు రెట్టింపు అవుతుంది", "నిన్న లాస్.. ఇవాళ విన్ గ్యారంటీ!" అనే దుష్ప్రచారాలతో యువతను వల వేసి లోన్లలో నెట్టేస్తున్నారు. ఈ డిజిటల్ మాయలో పడకుండా ఉండాలంటే డిజిటల్ లిటరసీ ఎంతో కీలకం. ప్రతి స్కూల్, కాలేజీలోనే కాకుండా, గ్రామీణ స్థాయిలో కూడా ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే, సూసైడ్ హెల్ప్‌లైన్ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేసి, మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన యువతను ఈ ఆటల ముంపు నుంచి బయటపడేయవచ్చు.