Bobbili Yuddham : బొబ్బిలి యుద్ధానికి 265 ఏళ్లు.. !

Bobbili Yuddham : బొబ్బిలి యుద్ధానికి ఇవాళ్టితో 265 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమ పూర్వికుల వీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు బొబ్బిలి రాజవంశీయులు.

Update: 2022-01-24 11:45 GMT

Bobbili Yuddham: బొబ్బిలి యుద్ధానికి ఇవాళ్టితో 265 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమ పూర్వికుల వీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు బొబ్బిలి రాజవంశీయులు. భారత చరిత్రలోనే బొబ్బిలి యుద్ధానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాడు బొబ్బిలికి, పొరుగున ఉన్న విజయనగర రాజులకు మధ్య తీవ్రమైన విభేదాలుండేవి. ఈ కారణం వల్లే ఫ్రెంచ్‌ కమాండర్‌ బుస్సీ సహకారంతో బొబ్బిలిపై యుద్ధానికి దిగారు విజయనగరం రాజులు. నాటి యుద్ధంలో బొబ్బిలి సైన్యం తక్కువ బలగంతోనే వీరోచితంగా పోరాడింది. ఫిరంగుల ధాటికి కోట ధ్వంసమైంది. రాజవంశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరోజులోనే నాటి యుద్ధం ముగిసింది. బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు కుమారుడు ఒక్కరే ప్రాణాలతో మిగిలారు.

వేగుల ద్వారా ఆలస్యంగా ఈ సమాచారం తెలుసుకున్న బొబ్బిలి రాజు బావమరిదైన తాండ్ర పాపారాయుడు.. యుద్ధం ముగిసిన 3వ రోజు రహస్యంగా విజయననగరం రాజు శిబిరంలోకి ప్రవేశించి పూసపాటి పెద విజయరామరాజును చంపి ఆయనా మరణించారు. నాటి బొబ్బిలి యుద్ధాన్ని స్మరించుకుంటూ ఏటా జనవరి 24న కోటలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. నాడు యుద్ధంలో వాడిన కత్తులు, బల్లేలు, కవచాలు, తుపాకుల్లాంటివన్నింటినీ కోటలో సందర్శనకు ఉంచారు. సింహాసనం సహా అనేక వస్తువులతో కలిపి మ్యూజియంగా ఉంచి వారసత్వ సంపదను సంరక్షిస్తున్నారు. ఇక.. బొబ్బిలి యుద్దం జరిగిన చోట, బొబ్బిలి కోట నెలమట్టమైన చోట స్మారక స్థూపం కూడా ఏర్పాటు చేశారు.

1750 ప్రాంతంలో ఉత్తరాంధ్ర సంస్థానాధీశులు ఫ్రెంచ్‌ వారికి కప్పం కట్టడం మానేశారు. ఈ నేపథ్యంలో వాటిని వసూలు చేసేందుకు వచ్చిన జనరల్‌ బుస్సీ అన్ని సంస్థానాలకు తాఖీదులు పంపారు. అప్పటికే బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య విభేదాల కారణంగా.. విజయనగరం రాజుల ప్రతిపాదనకు ఒప్పుకుని వారి పక్షాన ఫ్రెంచ్‌ సేనలు పోరాడడంతో బొబ్బిలి యుద్ధం జరిగింది. చివరికి బొబ్బిలి వంశీయుల్లో అందరూ ప్రాణాలు కోల్పోయాక.. ఇటు విజయనగరం రాజు మరణించాక.. నాడు ప్రాణాలతో బయటపడిన బొబ్బిలి రాజు రంగారావు కుమారుడికి బుస్సీ పట్టాభిషేకం చేశారు.

అప్పట్లో నీళ్లు, భూముల విషయంలోనే ఈ రెండు రాజ్యాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉండేవని చరిత్ర చెప్తోంది. ఈ బొబ్బిలి యుద్ధానికి ముందు కూడా అనేక యుద్ధాలు జరిగినా.. 1757వ సంవత్సరం జనవరి 24న సమరం 'బొబ్బిలి యుద్ధం'గా గుర్తింపు పొందింది. ఫ్రెంచ్ బలగాల అండతో బలంగా ఉన్న విజయనగరం రాజులు ఎలా దాడికి యత్నించారు, నాడు ఏం జరిగిందీ అనేది బొబ్బిలి వంశీయులైన బేబినాయన వివరించారు. ప్రస్తుతం బొబ్బిలి, విజయనగరం సంస్థానాల వారసులు ఒకే పార్టీలో కొనసాగుతున్న నేపథ్యంలో.. మారిన పరిస్థితులు, కాలానికి తగ్గట్టు అంతా కలిసి పనిచేస్తున్నామని అంటున్నారు బేబి నాయన.

Tags:    

Similar News