పశ్చిమగోదావరి జిల్లాల వారధిగా ఉన్న బొబ్బిలి వంతెన శిథిలావస్థకు చేరింది. కూలేందుకు సిద్ధంగా ఉంది. గణపవరంలోని వెంకయ్య వయ్యేరుపై 1883లో బ్రిటీష్ ప్రభుత్వం నిర్మించిన ఈ వంతెనను బొబ్బిలిరాజు ప్రారంభించడంతో బొబ్బిలి వంతెనగా పిలుస్తుంటారు. గణపవరం పరిసర 120 గ్రామాల ప్రజలు ఈ వంతెన మీద నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. 1980లో బొబ్బిలి వంతెన కూలిపోయింది. భువనపల్లి గ్రామానికి చెందిన పట్టెం వెంకట్రావు అనే వ్యక్తి ఈ ఎడ్లబండిపై వెళుతూ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. 1982లో వంతెన తిరిగి నిర్మించారు. ఈ వంతెన నిర్మించి 43 ఏళ్లు దాటినా అనాటి నుంచి ఈనాటి వరకు కనీస మరమ్మతులు చేయలేదు. ఈ వంతెన మీదుగా ఉభయ, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి నిత్యం ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు, తరలించే వాహనాలు, పాఠశాలల, ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. ప్రస్తుతం ఈ రహదారి లోనే ఉన్న నారాయణపురం వంతెన కూడా శిథిలావస్థకు చేరి దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బొబ్బిలి వంతెనకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని ఈ ప్రాంతవాసులు భయపడుతున్నారు. ఈ వంతెన మీద సపోర్టువాల్స్ ధ్వంసం అవడం, పుట్ఫాట్పై పెద్దపెద్ద రంధ్రాలు ఏర్పడటంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. పాదచారులు నడిచి రాత్రివేళల్లో కూడా కాల్వలో పడి కొట్టుకు పోయిన సంఘటనలు జరిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి వంతెన నిర్మించాలని కోరుతున్నారు.