రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని మహిళలు ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ డిపో పరిధిలో 75 శాతం బస్సుల్లో ఉచిత సౌకర్యం ఉందని డిపో మేనేజర్ వై.వి.వి.ఎన్.కుమార్ తెలిపారు. మొత్తం డిపోలో 62 బస్సులు ఉండగా 46 పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చున్నారు. అలాగే కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళే ప్రత్యేక బస్సుల్లో కూడా ఆదివారం నుంచి మహిళలకు ఉచిత సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. మొదటి రెండు రోజులు వాడపల్లి బస్సులకు ఈ సౌకర్యం వర్తింపజేయక పోవడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ పథకం అమలు చేస్తున్నప్పటికీ మహిళలకు ఈ సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉంటుందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.