PNB బ్యాంకు ఎండీ, సీఈవో ఢిల్లీలో జగన్‌ను కలిశారు.. రఘురామ సంచలనం
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు డైరెక్టర్‌గా ఉన్న ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. 826 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదంటూ పంజాబ్..;
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు డైరెక్టర్‌గా ఉన్న ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. 826 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 10 మంది డైరెక్టర్లపై కేసు పెట్టింది. హైదరాబాద్, ముంబైతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో గురువారం ఏకకాలంలో 11చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో కూడా సీబీఐ ఈ కంపెనీలో సోదాలు నిర్వహించింది. సీబీఐ జారీ చేసిన అధికారిక ప్రకటనలో రఘురామ కృష్ణంరాజు పేరు లేదు. అయితే... ఇండ్-భారత్ కంపెనీలో రఘురామ కృష్ణంరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎండీ, సీఈవో మల్లికార్జునరావు ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిశారు. సరిగ్గా అదే రోజే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఇండ్-భారత్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసిందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తనను కూడా ఏదో ఒకరకంగా సీబీఐ కేసుల్లో నిందితుడిగా చేయాలనే ఉద్దేశంతోనే ఫిర్యాదు చేసేలా ఒత్తిడి చేసినట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ప్రాథమిక దర్యాప్తు మాత్రమేనని... కేసు విషయంలో తానేమీ భయపడటంలేదని అని రఘురామ తెలిపారు.