CBN: చంద్రబాబు ప్రజంటేషన్... మోదీ ప్రశంసలు
ఏపీలో సంస్కరణలు పరిశీలించాలని మిగిలిన సీఎంలకు మోదీ సూచన;
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై చంద్రబాబు నివేదిక ఇచ్చారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు వివరించారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. ఈ బ్లూప్రింట్ ప్రజంటేషన్‌పై ప్రధాని మోదీ అభినందించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని...సీఎం చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ సమావేశంలో వృద్ధిరేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, రెండవ, మూడవ శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చంద్రబాబు చర్చించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పీ 4 ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామని సమావేశంలో అన్నారు. వికసిత్ భారత్ 2047 సాకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని చెప్పుకొచ్చారు. విశాఖకు గ్లోబల్ హంగులు అద్దేలా నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖ మోడల్‌ను అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరారు.