CBN: ఎరువుల సరఫరాపై సీఎం కీలక ఆదేశాలు
క్షేత్రస్థాయికి వెళ్లాలని కలెక్టర్లకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల సరఫరా తీరుతెన్నులను క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎరువుల సరఫరాపై రైతుల్లో ఉన్న అనుమానాలు, ఆందోళన తొలగించాలని నిర్దేశించారు. వచ్చే రబీలో వెబ్ ల్యాండ్ - ఈ పంట అనుసంధానంతో రైతుల ఆధార్ ఆధారంగా ఎరువుల సరఫరా చేపట్టాలని సూచించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల సరఫరాపై రైతుల నుంచి నేరుగా తాను తెప్పించుకున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా సమీక్ష జరిపారు. జిల్లాల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని అధికారులు ఇచ్చిన సమాచాచంతో పోల్చి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఎంతెంత ఎరువులు అందుబాటులో ఉన్నాయి, డిమాండ్ ఎలా ఉంది అనే విషయాలను కలెక్టర్లు సీఎంకు వివరించారు. ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతోందని రైతులకు డిమాండ్ మేరకు అందుతున్నాయని అధికారులు చెప్పారు. జిల్లాల్లో 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అదనంగా 41 వేల టన్నుల ఎరువులు
ఆంధ్రప్రదేశ్‌కు త్వరగా 41 వేల టన్నులు ఎరువులు రానున్నాయి. కాకినాడ పోర్టుకు రేపు ఒక వెజల్ వస్తుందని దాని నుంచి 15000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులోకి వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. మరో 10 రోజుల్లో 41 వేల టన్నుల ఎరువులు రాష్ట్రానికి అదనంగా రానున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల, కృష్ణా, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరత ఉందని ఈ సమస్య పరిష్కరించేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. ఆ సమస్యని కూడా సత్వరమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.
ముమ్మరంగా సాగుతున్న అమరావతి పనులు
ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. నేలపాడులో గెజిటెడ్ అధికారుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం భవన నిర్మాణాల పనుల పురోగతిపై సీఆర్డీఏ ఇంజినీర్లు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం అమరావతిలో గెజిటెడ్ అధికారులకు 14 టవర్స్ లో 1440 ఇళ్లను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31 లోగా అన్ని టవర్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని, అమరావతిలో రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తైందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందని, అక్కడ ఇళ్ల నిర్మాణ పనులు జరగడం లేదని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏసీ రూముల్లో కూర్చుని చూసే వారికి నిర్మాణాల గురించి తెలియని, బయటకు వచ్చి చూస్తే నిజనిజాలేంటో తెలుస్తాయన్నారు.