TG: ఈ నెల 22న రైతు భరోసా' నిధుల విడుదల
రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల వాగ్దానం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతు భరోసా'పథకం నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. గత కొంతకాలంగా ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ పథకం ప్రారంభోత్సవానికి సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా మొదటి విడత నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్ల నగదు జమ కానుంది. అలాగే 20 రోజుల అనంతరం రెండో విడతలో రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరున మూడవ విడత నిధులు రూ. 9 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అందించిన రైతు బంధు స్థానంలో, పెంచిన పెట్టుబడి సాయంతో 'రైతు భరోసా'ను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధుల విడుదల ద్వారా సాగు పనులకు అవసరమైన ఖర్చుల కోసం రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది.
సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ....
రైతు భరోసా మొదటి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి పెట్టుబడి సాయంనిధులను సీఎం రేవంత్‌రెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి సీఎం నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 70 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు రెండు విడతల్లో పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయనున్నారు. తొలి విడత పూర్తయిన 20 రోజుల తర్వాత.. రెండో విడత కింద మరో రూ.2,650 కోట్లను విడుదల చేసేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత నిధులను కూడా చెల్లించి, ఈ సీజన్‌కు సంబంధించిన పంపిణీని 100 శాతం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికిగానూ మొత్తంగా రూ.9 వేల కోట్లను3 దశల్లో బదిలీ చేయనున్నారు. ఎకరానికి ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తుండగా, ఈ ప్రస్తుత సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం రైతుల చేతికి అందనున్నది.