CBN: ఉద్యోగులకు ఇబ్బంది రాదు.. నేను రానివ్వను
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన... గురుపూజోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.... టీచర్లను మర్పిపోలేమన్న సీఎం చంద్రబాబు
పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్లతోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్ బెస్ట్ ప్రాక్టీసెస్ విధానాలను సీఎం పరిశీలించారు. టీచర్లను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేమని చంద్రబాబు అన్నారు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులే అన్న చంద్రబాబు.. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు తన జీవితంలో స్ఫూర్తి నింపారని వెల్లడించారు.
నేను నిత్య విద్యార్థిని
తాను నిత్య విద్యార్థిని.. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని అన్నారు. విద్యార్థులు జాతీయ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు సాధించేలా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఆంధ్ర వర్శిటీకి 4వ ర్యాంకు రావడం శుభపరిణామమని, ఇలాంటి ర్యాంకులు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. అలానే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా నెలకొల్పిన గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ను నిర్వాహకులు ముఖ్యమంత్రికి అందించారు. గురుపూజోత్సవం చాలా పవిత్రమైన కార్యక్రమమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల తర్వాత మనం గుర్తు పెట్టుకునేది ఉపాధ్యాయులనే అని, అలాంటి వారిని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేమని అన్నారు. విద్యార్థి దశలో పిల్లల్లో స్ఫూర్తిని కలిగించాలన్నారు.
క్రెడిట్ అంతా భువనేశ్వరిదే
"సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుకోరు. లోకేశ్ చదువు గురించి నా భార్యే చూసేది.. ఆ క్రెడిట్ ఆమెదే. డీఎస్సీ అంటే ఎప్పుడూ జాప్యం చేయను.. సమయానికి భర్తీ చేస్తా. ఒకప్పుడు టీచర్ల బదిలీలు జడ్పీ ఛైర్మన్ చేతిలో ఉండేవి. టీచర్ల బదిలీల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ తెచ్చింది నేనే. కొన్ని ఉద్యోగాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంపాదిస్తున్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునేందుకు అండగా ఉన్నాం. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం’" అని చంద్రబాబు అన్నారు.
విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచాం:లోకేశ్
గురువులు చూపించిన దారిలో నడవడం వల్లే తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోగలిగానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పిల్లల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని, విద్యాశాఖలో ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. అందరం కలిసి కట్టుగా ఆంధ్రా మోడల్ విద్యా వ్యవస్థను ప్రపంచానికి చాటుదామని మంత్రి స్పష్టం చేశారు. చదువు ఒక వ్యక్తిని పేదరికం నుండి బయటకి తీసుకొస్తుందనటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం అని తెలిపారు. గురువులే చూపించిన దారే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు.