CBN: టీడీపీ ఎంపీపై డ్రగ్స్ ఆరోపణలు.. చంద్రబాబు సీరియస్
పూర్తి నివేదిక ఇవ్వాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడికి ఆదేశం
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. పుట్టా మహేశ్‌పై వచ్చిన ఆరోపణలను సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఆయన్ను అధిష్ఠానం ఆదేశించింది. ఈ ఘటనపై మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదన్నారు. వ్యక్తులు, నేతల బలహీనతలు, తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వొద్దని చెప్పారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌తోపాటు రితేశ్‌రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిలకు పాజిటివ్ వచ్చింది.
ఎంపీ పుట్టా మహేశ్‌కు స్టేషన్ బెయిల్
మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసి అనంతరం విడుదల చేశారు. మొయినాబాద్ పరిధిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో పలువురిపై పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌తో పాటు రితేశ్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
శనివారం రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌లో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌కు నెగిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కానీ అనంతరం నిర్వహించిన రక్త పరీక్షలో మాత్రం డ్రగ్స్ వినియోగం ఉన్నట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ఎస్పీ గిరిధర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా మహేశ్ కుమార్‌ను పోలీసులు ప్రశ్నించి, చట్టపరమైన ప్రక్రియలో భాగంగా స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కోణాల్లో కూడా విచారణ సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై BNS 109తోపాటు ఆర్మ్స్ యాక్ట్..కేసు నమోదు చేశారు.