CBN: ఉద్యాన రంగం మరో గేమ్ ఛేంజర్
వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో చర్చ... రైతులకే తొలి ప్రాధాన్యమన్న చంద్రబాబు... శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్
ప్రతి ఎమ్మెల్యే నెలకు ఒక రోజు రైతుల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసు కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వచ్చే నెల నుంచి రైతులకు సంబంధించి తక్షణ కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. తాను ఐటీపై మాట్లాడితే ఐటీ వ్యక్తి అనుకుంటారని, కానీ రైతుల కోసమే ఎక్కువ ఆలోచిస్తా అన్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని, రైతుల నికర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం అని సీఎం చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాల ద్వారా రైతులను నంబర్ వన్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ రంగంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రైతులు, వ్యవసాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
యూరియాకి పరిమితిఉండాలి
‘రైతులు యూరియాను మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. ఎరువుల వినియోగం తగ్గిస్తే పీఎం ప్రణామ్ కింద నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది. పీఎం ప్రణామ్ కింద కేంద్రం ఇచ్చిన నిధులను రైతులకు చెల్లిస్తాం. చరిత్రలో తొలిసారి హెక్టారు ఉల్లికి రూ.50 వేలు ఇస్తున్నాం. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలి. రైతులు బాగుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. వ్యవసాయం లాభసాటిగా మారేంత వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేలా చేస్తాం. పొలం బడి, పొలం పిలుస్తోంది రా అనే వివిధ కార్యక్రమాల ద్వారా గతంలో రైతులతో మాట్లాడాం. ప్రతీ శాసనసభ్యుడూ నెలకు ఒక్క రోజు పొలం దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడాలి’ అని సీఎం చెప్పారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా వృద్ధి రేటు సాధించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఉద్యాన రంగం రాష్ట్రంలో మరో గేమ్ ఛేంజర్‌లా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. 2029 నాటికి ఉద్యాన పంటలను భారీగా పెంచుతామని తెలిపారు. సూక్ష్మ సేద్యం ద్వారా లబ్ధిపొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా ఉందన్నారు.
ట్రంప్ దెబ్బకు "అక్వా" విలవిల
ట్రంప్ దెబ్బకు ఆక్వా రంగం విలవిలలాడుతోందని.. కొత్త మార్కెట్ల కోసం కేంద్రంతో మాట్లాడుతున్నట్లు సీఎం చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపైనా దృష్టి సారించినట్లు తెలిపారు. రైతులు.. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించాలని సూచించారు. అప్పుడే నాణ్యమైన పంట ఉత్పత్తులు వస్తాయని, నాణ్యమైన ఆహారం ప్రజలకు అందించ వచ్చని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో 35 శాతం మేర జీఎస్డీపీ వ్యవసాయం నుంచే వస్తోంది. రైతులు, ప్రజా ప్రతినిధులు అందరం కలిసి వ్యవసాయాన్ని లాభసాటి చేద్దాం. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే. ఐటీ గురించి మాట్లాడితే.. ఐటీ వ్యక్తి అనుకుంటారు కానీ నేను చేసిన పనులన్నీ రైతులకు ఉపకరించేవే. నీరు, చెట్టు, రిజర్వాయర్లు, చెక్ డ్యామ్‌లు, కాలువలు ఇలా ప్రతీ అంశాన్నీ వ్యవసాయ రంగానికి అనుకూలమైన ఆలోచనలే చేశా. సాగునీరు, వ్యవసాయ రంగం అభివృద్ధికే నిర్ణయాలు తీసుకున్నాను. అక్టోబరు నుంచి క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.