CBN: అభివద్ధిలో మాది ఆల్‌టైం రికార్డు
నెలాఖరులోగా మెగా డీఎస్సీ నియామకాలు పూర్తి... ఏపీది డెత్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ.. భవిష్యత్తుకు బాటలు వేశామన్న చంద్రబాబు;
“ 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి" అనే ఎన్డీయే నినాదాన్ని ప్రజలు నమ్మి చరిత్రాత్మక తీర్పునిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని వెల్లడించారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలందించిన పోలీసు ఉన్నతాధికారులకు సీఎం పతకాలు అందజేశారు.
మెగా డీఎస్సీ నియామకాలను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామన్న చంద్రబాబు... ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించామని గుర్తు చేశారు. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసి సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చామని గుర్తు చేశారు. పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ‘తల్లికి వందనం’ తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. దీని ద్వారా 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు అందించామని వెల్లడించారు. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్న చంద్రబాబు.. 2 కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చామన్నారు. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని... పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు తిరిగి తెరిచామని వెల్లడించారు.
"బనకచర్లతో ఎవ్వరికీ నష్టం లేదు"
బనకచర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయాజనాలకు నష్టం వాటిల్లదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న సీఎం.. " గోదావరి వృథా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలని సూచించారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తాం. బనకచర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకూ నష్టం వాటిల్లదు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లాను కరవు నుంచి బయటపడేసే వెలుగొండకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఏడాది జులై నాటికి సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు పనులు చేస్తున్నాం.” అని స్పష్టం చేశారు. అడవితల్లి బాటలో’ ద్వారా రూ.1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్న చంద్రబాబు.. మారుమూల గిరిజన ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తున్నామని వెల్లడించారు. రాయలసీమను సస్యశ్యామలం చేయాలని నిర్ణయించామన్నారు.