CBN: నదులు అనుసంధానిస్తాం..కరువును తరిమేస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన.. నీటి నిర్వహణతో కరువును పారదోలుతాం... డిసెంబర్ 25 నాటికి డయాఫ్రం వాల్ పూర్తి
నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరవు అనే మాట రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నాడు నీటిపారుదల, ప్రాజెక్టులపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్టులు తాను ప్రారంభించినవే అని వెల్లడించారు. తొలిసారిగా అనంతపురంలో రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం ప్రారంభించానని తెలిపారు. ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు లిఫ్ట్ ద్వారా శ్రీశైలం ఎడమ కాల్వ ద్వారా నీళ్లిచ్చామని తెలిపారు. సరైన వినియోగంతో రాష్ట్రంలో 700 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. పదేళ్లలో 439 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చినట్లు తెలిపారు. డిసెంబరు 25 నాటికి పోలవలం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని వెల్లడించారు. కుప్పం ప్రాంతానికి నీళ్లు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైందన్నారు. నదుల అనుసంధానంతో సాగుకు ఊతమని గతంలో అప్పటి ప్రధాని వాజ్పేయీకి సూచించానని చంద్రబాబు తెలిపారు. అప్పుడు టాస్క్ఫోర్స్ వేసినా అనంతర పరిణామాలతో అది ముందుకు సాగలేదని పేర్కొన్నారు. సరైన వినియోగంతో రాష్ట్రంలో 700 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.
పోలవరం సమస్యలను అధిగమిస్తున్నాం
పోలవరం నిర్మాణంలో సమస్యలు అధిగమిస్తూ వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గత పాలనలో ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని... దీనికి మళ్లీ రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. డిసెంబరు 25 నాటికి పోలవలం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని... ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధార వరకు నీళ్లు తరలించవచ్చన్నారు. "రూ.960 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయి. అక్టోబరులోనే అనకాపల్లి వరకు ఈ జలాలు తీసుకొస్తాం. రూ.1425 కోట్లతో ఈ ప్రాజెక్టును పోలవరం కుడి కాలువతో అనుసంధానించాం.” అని చంద్రబాబు వెల్లడించారు. గత పాలనలో చిత్తూరు జిల్లాలో ప్రీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు చేపట్టారు. వైకాపా వర్గీయుల కోసం రూ.2,144 కోట్లతో ప్రాజెక్టు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్జీటీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. పనులు నిలిపివేయించిన కోర్టు.. రూ.100 కోట్లు ఫైన్ వేసి, రూ.25 కోట్లు కట్టాలని చెప్పింది. వైకాపా నేతలు చేసిన తప్పులకు ప్రభుత్వం రూ.25 కోట్లు జరిమానా కట్టింది’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.