ఏపీలో డ్రగ్ మాఫియా చెలరేగిపోతుంది : చంద్రబాబు
ఏపీలో డ్రగ్ మాఫియా చెలరేగిపోతోందని, మత్తుతో యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.;
chandrababu naidu (File Photo)
ఏపీలో డ్రగ్ మాఫియా చెలరేగిపోతోందని, మత్తుతో యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన... వైసీపీ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. డ్రగ్స్ డాన్స్‌గా, స్మగ్లింగ్ కింగ్‌లుగా వైసీపీ ముఖ్యనేతలు అవతారమెత్తారని విమర్శించారు. షెల్ కంపెనీలు సృష్టించి అవినీతికి పాల్పడటంలో జగన్‌రెడ్డి దిట్టన్నారు. పండరో పేపర్స్‌లో జగన్‌రెడ్డి పేరు కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రజలకు వాస్తవాలు బహిర్గతం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి జగన్‌రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దొంగ లెక్కలు చూపిస్తూ రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. పాఠశాలల్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి 11,500 కోట్ల భారం మోపారని చెప్పారు చంద్రబాబు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో మరో 24 వేల 500 కోట్ల భారం మోపారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా 31 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.