CHANDRABABU: మహిళలకు కూటమి సర్కార్ గుడ్న్యూస్
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమవేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆగస్టు 15 నుంచి స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అమలు చేయబోతున్నారు.. ఇక, ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిప్ట్) పాలసీ 4.0… 2024-29కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. 22 ఏపీ టూరిజం డెవలప్మెంట్ హోటళ్లు, ఆరు క్లస్టర్ల పరిధిలోని రిసార్టుల ఆపరేషన్లకు ఏజెన్సీల ఎంపికకు వీసీ అండ్ ఎండీకి అనుమతులు మంజూరు చేసింది.. ఈనెల 9న రాఖీ పౌర్ణమి వేడుకలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా మహిళలకు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అమలు కానున్న ఫ్రీ బస్సు పథకంపై ఈ నెల 9న సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. అంతేకాదు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే జిల్లాల పునర్విభజనలో లోపాలు, సరిహద్దు సమస్యలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని కేబినెట్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. జనగణన ప్రారంభమయ్యేలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు కేబినెట్ మంత్రులు పేర్కొన్నారు.
కీలక నిర్ణయాలకు ఆమోదం
కేబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీను ఆమోదించారు. అయితే కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభానికి ముందే.. ఆటో డ్రైవర్లను పిలిపించి వారితో మాట్లాడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో సూచించారు. ఈ సూచనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఆటో డ్రైవర్లను వెంటనే పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వారితో మాట్లాడి తగిన సహాయం చేయాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ఆగస్ట్ 15వ తేదీ.. స్వాతంత్ర దినోత్సవమని.. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులు విన్నవించారు. కానీ టైమ్ అడ్జెట్ చేసుకుని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని వారికి సీఎం సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ప్రతీ ఒక్కరికి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.