భూ వివాదాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల జరిగిన కలెక్టర్ సమీక్ష సమావేశంలో భూముల అంశంపై సీఎం చాలా కీలకంగా స్పందించారు. జిల్లాల్లో భూ సమస్యలు, అక్రమ కబ్జాలు, రాజకీయ జోక్యం వంటి అంశాలు తన దృష్టికి రావడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొంతమంది రాజకీయ నేతలు భూ వివాదాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారన్న సమాచారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గత వైసీపీ పాలనలో భూముల కబ్జాలు విచ్చలవిడిగా జరిగాయన్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికార బలంతో భూ జయమానులను బెదిరిస్తూ, 22ఏ సెక్షన్ ఉందని భయపెట్టి భూములు కబ్జా చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని చంద్రబాబు వివరించారు.
ఇప్పుడు కూటమి హయాంలో ఎమ్మెల్యేలు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు ఎవ్వరూ కూడా భూ వివాదాలకు దగ్గర కావద్దని కఠినంగా హెచ్చరించారు. ఎన్డీయే కూటమి నుంచి ఎవరైనా భూ అక్రమాల్లో ఇన్వాల్వ్ అయితే చర్యలు తప్పవని సీఎం తేల్చిచెప్పారు. పార్టీ, పదవి, హోదా అన్నది చూడకుండా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడానికైనా వెనుకాడబోమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చట్టం అందరికీ సమానమేనని మరోసారి గుర్తు చేశారు.
భూముల విషయంలో పేదలు, రైతులు, సాధారణ ప్రజలు ఎక్కువగా నష్టపోతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే భూ పరిపాలన వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. మనం జగన్ హయాంలో ఇలాంటి ఆదేశాలు ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే జగన్ అండ చూసుకునే వైసీపీ నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా భూముల కబ్జాకు తెరలేపారు. వందల ఎకరాలల్లో కబ్జా చేశారు కొందరు బడా లీడర్లు. కానీ చంద్రబాబు మాత్రం అలాంటి అరాచకాలను అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. చంద్రబాబు, పవన్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.