AP High Court: చంద్రబాబు తరపున క్వాష్ పిటిషన్..
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరుతూ;
స్కిల్ కుంభకోణం పేరిట సీఐడీ తనపై నమోదు చేసిన కేసు, దాని ఆధారంగా కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పరిష్కారం అయ్యేవరకూ తనపై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. మంగళగిరి సీఐడీ ఎస్‌హెచ్‌వో, APSSDC ఛైర్మన్ అజయ్‌రెడ్డినివ్యాజ్యంలోప్రతివాదులుగా చేర్చారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం పబ్లిక్ సర్వెంట్‌పై కేసు పెట్టాలంటే గవర్నర్ నుంచి ముందస్తు ఆమోదం తప్పనిసరి అని, అలాకాకుండా సీఐడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అత్యవసర విచారణకు అనుమతించాలని కోరారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు APSSFC, సీమెన్స్ మధ్య ఒప్పందం జరిగింది. నిధుల వినియోగంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 డిసెంబరు 9న సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. దీనిలో తన పాత్ర గురించి ఆ ఫిర్యాదులో ప్రస్తావనే లేదని.. ఓ నిందితుడు చెప్పారని ఏడాది తర్వాత తన పేరు తెరపైకి తెచ్చారని చంద్రబాబు తెలిపారు. తప్పుడు కేసులో ఇరికించి తనను అరెస్టుచేయాలని సీఐడీ, రాష్ట్రప్రభుత్వం ఏకైక లక్ష్యంతో వ్యవహరించాయని వివరించారు. రిమాండు రిపోర్టులో ఒక్కటైనా చెల్లుబాటు అయ్యే ఆధారాలు లేవన్నారు.తనపై చేసిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని... చేయని నేరానికి నన్ను బలిపశువును చేయాలనే లక్ష్యంతో ఆరోపణలు చేసినట్లు అర్థమవుతోందని చంద్రబాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోయినా నన్ను నిందితుడిగా చేర్చారని... ఈ కేసులో తదుపరి చర్యలను కొనసాగనిస్తే విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లు అవుతుందని చంద్రబాబు వివరించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు గురించి ఆనాడు సీనియర్ అధికారులు చర్చించి నిర్ణయం తీసుకున్నారన్నారు. గుజరాత్‌లో సీమెన్స్ సంస్థ కార్యకలాపాలను వారు పరిశీలించారని... ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకొని నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం అమలుచేసిందన్నారు. ప్రాజెక్టు అమలుకాలేదని దర్యాప్తుసంస్థ తేల్చినప్పుడే పబ్లిక్ సర్వెంట్ విశ్వాసఘాతుకానికి పాల్పడినట్లు అవుతుందన్నారు. సీఐడీ క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించకుండా ఊహాజనిత ఆరోపణలు చేస్తోందన్నారు. రాష్ట్రప్రభుత్వం చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని.... ఈ కేసులో దర్యాప్తు చేసే అధికారం, తనను అరెస్టు చేసే అధికారం, జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని అభ్యర్థించే హక్కు సీఐడీకి లేవన్నారు. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందున అది చెల్లుబాటు కాదని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.