ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇరువురు మధ్య సుమారు గంట పాటు కీలక చర్చలు జరిగాయి. పెహల్గామ్ ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై ఇరువురు నేతల మధ్య చర్చ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు, నిర్ణయాలకు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానికి సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
మే 2వ తేదీన ఏపి రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనులకు శంఖుస్థాపన కార్యక్రమం జరగనుంది.. ఈ శంఖుస్థాపన చేసేందుకు రావాలని ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. గత బడ్జెట్ సమావేశాల్లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయలు సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమరావతి పునర్ నిర్మాణానికి తోడ్పాటును అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.