ఇవాళ రామతీర్థానికి టీడీపీ అధినేత చంద్రబాబు

రామతీర్థం ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వెంటనే దోషులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.

Update: 2021-01-02 01:12 GMT

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో బోడికొండపై కొలువైన కోదండరామ ఆలయంలో.. రాములు వారి శిరస్సును ఖండించిన ఘటన ఉత్తరాంధ్ర ప్రజలను ఒక్కసారిగా కలిచివేసింది. కొంతమంది గుర్తు తెలియని దుండగులు నాలుగు రోజులు క్రితం ఆలయ తలుపులను పగలగొట్టి రాములు వారి శిరస్సును మొండెంను వేరు చేశారు. ఈ దుశ్చర్యకు నిరసనగా భక్తులు, పలు హిందూ ధార్మిక సంఘాలు, బీజేపీ, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. ప్రత్యేకంగా బీజేపీ శ్రేణులు దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి గత నాలుగు రోజులుగా రామదీక్ష చేపడుతున్నారు.

రామతీర్థం ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వెంటనే దోషులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆలయ పరిశీలనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు విశాఖకు చేరుకొని రోడ్డు మార్గం ద్వారా పదకొండున్నరకు రామతీర్ధం చేరుకుంటారు. అక్కడ నుండి స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలుతో కలిసి కొండపైన ఉన్న కోదండరామ ఆలయానికి వెళ్లనున్నారు. చంద్రబాబు 250 మెట్లను ఎక్కనున్నారు. అనంతరం అక్కడ పరిస్థితులను గమనించి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టనున్నారు. ఇప్పటి వరకు 125కి పైగా ఆలయాల్లో దాడులు జరిగినా ప్రభుత్వం ఒక్క నిందితుడ్ని పట్టుకోలేదని విమర్శించారు చంద్రబాబు.

గత నెల 30న జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం.. ఘటనపై కనీసం స్పందించకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. 400 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఆలయంపై దాడి జరిగితే కనీసం స్పందించకపోవడం దారుణమని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా నిందితులను గుర్తించడంలో పోలీస్ శాఖ విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ శ్రేణులు నిరసనలు దీక్షలు చేపడుతున్నారు. చంద్రబాబు పర్యటన భక్తులకు, జిల్లా వాసులకు కొంత అండగా నిలవనుంది.

చంద్రబాబు పర్యటనకు జిల్లా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అటు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు ఇవాళ రామతీర్థానికి తరలిరానున్నాయి.


Tags:    

Similar News