సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమైన విధాన నిర్ణయాలతో పాటు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్‌ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్యేల వ్యవహారాలపై లోకేశ్‌తో మంత్రుల చర్చ
క్యాబినెట్ సమావేశానికి ముందు లోకేశ్ మంత్రులతో మాట్లాడుతూ.. కొంతమంది ఎమ్మెల్యేల వివాదాస్పద ఘటనలను ప్రస్తావించారు. దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్, నజీర్ అహ్మద్ వంటి ఎమ్మెల్యేల చర్యలపై లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే శ్రీకాంత్‌కు పెరోల్ సిఫార్సు చేసిన కోటంరెడ్డి, సునీల్ వంటి వారి ప్రవర్తన కూడా చర్చకు వచ్చింది. అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలతో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేల తీరు సరిగా లేదని లోకేశ్ తెలిపారు. ఈ విషయాలపై సీఎం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వానికి నష్టం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
పరిపాలనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం
సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పాలనలో వేగం పెంచాలని, దస్త్రాల క్లియరెన్స్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. అదే సమయంలో పెరోల్ విషయాల్లో ఎమ్మెల్యేలు సిఫార్సులు చేస్తే, వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి అనితకు సూచించారు.