CM Chandrababu: జగన్ కు శ్రీవారిపై నమ్మకం ఉందా..? లేదా..?

తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా?... ముఖ్యమంత్రి చంద్రబాబు సూటి ప్రశ్నలు;

Update: 2024-09-25 01:15 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో ఘటనలతో భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ దేవుడిని దర్శించుకోవచ్చని.. కానీ ఆయనకు వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందా? లేదా? అనేది ముఖ్యమని చంద్రబాబు అన్నారు. తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా? అని నిలదీశారు. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని... అలా డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమల ఎందుకు వెళ్లాలని నిలదీశారు. ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయడానికి కాదని... అది అడిగితే బూతులు తిట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ హయాంలో రథం కాలిపోతే.. ఏముందీ తేనెటీగలు వచ్చాయన్నారని మండిపడ్డారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందని వ్యాఖ్యానించారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలన్నారు.

తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి...

సచివాలయంలోని మొదటి బ్లాకులో రియల్ టైం గవర్నెన్స్ సెంటరును సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి ముఖ్యమంత్రి వెళ్లారు. అధికారంలోకి వచ్చాక సెక్రటేరీయేట్‌లో ఓ విభాగాన్ని తొలిసారి సీఎం సందర్ళించారు. 2014-19 మధ్య కాలంలో ఆర్టీజీఎస్ విభాగంలో చంద్రబాబు తరుచూ సమీక్షలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఆర్టీజీఎస్ వ్యవస్ఖ మారింది. ఆర్టీజీఎస్ సెంటర్‌లో సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పౌరసేవలను సులభతరం చేయడం.. పాలనలో వేగం పెంచడంపై సమావేశంలో చర్చించారు.

మోదీ ప్రపంచ నేత

అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత్‌కు తిరిగివచ్చిన సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మోదీలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడి నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో భారత్‌ స్థానాన్ని బలపరచడంతోపాటు ప్రపంచ నాయకుడిగా ఎదిగారన్నారు. దేశాలను, జాతులను ఐక్యం చేయడంలో ప్రధాని కృషి ప్రశంసనీయమని... ఐక్యరాజ్య సమితిలో ప్రధాని ప్రసంగం.. రాబోయే రోజుల్లో ప్రపంచవేదికపై మనం పోషించబోయే పాత్రకు సాక్ష్యంగా నిలుస్తోందన్నారు.

Tags:    

Similar News