పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు ఇవాళ పరిశీలించనున్నారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించడంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించనున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తారు. సీఎం అయ్యాక ఈ ఏడాది ఆయన పోలవరాన్ని సందర్శించడం ఇదే రెండోసారి. అంతకుముందు జూన్ 17న ఆయన ప్రాజెక్టును సందర్శించారు.
సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 10.45 గంటలకు హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దనున్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసిన అనంతరం 10.50 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయల్దేరి 11.05 గంటలకు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 12.05 గంటల వరకు గ్యాప్-1, 2 వైబ్రో కాంపాక్షన్, డీవాల్ నిర్మాణ పనులు పరిశీలిస్తారు. 12.20 గంటలకు అతిథి గృహానికి చేరుకుని అధికారులు, గుత్తేదారులతో సమీక్షిస్తారు. 12.50 గంటలకు పాత్రికేయులతో మాట్లాడతారు. 1.15 గంటలకు అతిథి గృహం నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కణ్నుంచి రాష్ట్ర సచివాలయానికి పయనమవుతారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సీఎంతో కలిసి పర్యటనలో పాల్గొననున్నారు.