AP: ఏపీ మంత్రులకు డేంజర్ బెల్స్
సీఎం చంద్రబాబు హెచ్చరికలతో మంత్రివర్గంలో కలకలం;
ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రివర్గ సహచరులకు కాస్త గట్టిగానే హెచ్చరికలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు హెచ్చరికలతో మంత్రి పదవులకు తుదిఘడియలు సమీపించినట్లేనని అనుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే సీనియర్లు, జూనియర్లతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు జనసేన, ఒక్కరు బీజేపీ మంత్రులను తీసి పక్కన పెడితే మిగిలిన టీడీపీ మంత్రుల్లో చాలా మందిని సామాజికవర్గంతో పాటు యువత అని భావించి తీసుకున్నారు. యువత అయితే తనతో పాటు సమానంగా వేగంగా పరుగులు పెడతారని భావించారు. అయితే కూటమిలో మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా మంత్రులకు క్లాస్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. కొత్తగా మంత్రులు రావచ్చు అని కూటమి నుంచి వినిపిస్తోంది. కొందరు కేబినెట్ లో ఇన్ అయితే మరి కొందరు అవుట్ అవడం ఖాయమని అంటున్నారు. పాతిక మందికే కేబినెట్ లో చోటు ఉంటుంది. అందులో జనసేనకు ఒక బెర్త్ ని ఇస్తే టీడీపీ నుంచి ముగ్గురు నలుగురుకి చాన్స్ ఇస్తారని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ఒకరిద్దరి మంత్రుల విషయంలో చూస్తే కనుక డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అంటున్నారు. కీలకమైన శాఖను నిర్వహిస్తున్న వారి మీద ఆరోపణలు వస్తున్నాయని అనుకూల మీడియాలోనే వార్తలు వస్తూండడంతో తప్పిస్తారా అన్న చర్చ సాగుతోంది.
మార్పు తప్పదా..?
జనసేనకు ఒక మంత్రి పదవి అంటే విశాఖ జిల్లా నుంచి సీనియర్ నేత ఒకరికి చాన్స్ రావచ్చు అని అంటున్నారు. అదే విధంగా విశాఖ నగరానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకుండా ఉంది. దాంతో ఈసారి కచ్చితంగా చాన్స్ ఇస్తారని చెబుతున్నారు. అది కచ్చితంగా టీడీపీకి చెందిన వారికే దక్కుతుందని అంటున్నారు. ఆ అదృష్టవంతులు ఎవరు అన్నదే అంతా ఆలోచిస్తున్నారుట. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే విశాఖ సిటీ కంచుకోటగా ఉంది. అయితే మంత్రి లేకపోవడంతో రాజకీయంగా కొంత ఇబ్బందిగా మారిందని అంటున్నారు. విశాఖ జిల్లాను అంతా కలిపి ఉంచడం రాజకీయంగా దూకుడు పెంచడం వంటివి చేయాలంటే మంత్రిని సిటీ నుంచే ఎంపిక చేయాలని అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ కానీ మార్పులు కానీ ఉంటే కనుక విశాఖకి ప్రాధాన్యత ఉండొచ్చుటున్నారు. ఈ పుకార్ల వెనక నిజాలు ఏమిటి అన్నది కొంతకాలం ఆగితే తప్ప తెలియదు అన్నది రాజకీయ వర్గాలలో సాగుతున్న చర్చగా ఉంది.
50 మంది ఎమ్మెల్యేలు గెలవరా..?
ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై పలు సర్వేలు వెలువడ్డాయి. ఇందులో దాదాపు 40-50 మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలవడం కష్టమనే అంచనాలు వచ్చాయి. అలాగే మంత్రుల పనితీరుపైనా ఇందులో ప్రత్యేక ప్రస్తావనలు వచ్చాయి. పలువురు మంత్రులు సైతం ఈ సర్వేల్లో రెడ్ జోన్ లో కనిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఎన్నడూ లేనంతగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు సైతం ఈ సర్వేల్లో రెడ్ జోన్ లో కనిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఎన్నడూ లేనంతగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంచనాలకు తగినట్లుగా పనిచేయని మంత్రులపై వేటు తప్పదనే సంకేతాల్ని సీఎం చంద్రబాబు తాజాగా జరిగిన కేబినెట్ భేటీలోనే ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళనకు చంద్రబాబు సిద్దమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.