మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి రానివ్వబోమని కూటమి నేతలు స్పష్టంగా చెబుతున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిందని, రాష్ట్రం కనీసం 15 ఏళ్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. జగన్ పాలన వల్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తానంటూ జగన్ డైలాగులు కొడుతున్నాడు. తనకు మళ్లీ అవకాశం ఇస్తే కాంట్రాక్టర్లు, అధికారులు, పెట్టుబడిదారులను జైలుకు పంపుతానంటూ జగన్ వార్నింగ్‌లు ఇస్తున్నాడు. ఇలాంటి బెదిరింపు రాజకీయాల వల్లే గతంలో అనేక మంది పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లారు. జగన్ హయాంలో పరిశ్రమలు రావడం కాదు, ఉన్నవే మూతపడే పరిస్థితి వచ్చిందని కూటమి నేతలు చెబుతున్నారు.
పెట్టుబడిదారులకు భద్రత లేకుండా చేయడంతో పాటు, వ్యాపార వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీశారు వైసీపీ నేతలు. అందుకే జగన్ మళ్లీ వస్తే రాష్ట్రానికి వినాశనమేనని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడింది. ఏపీ అభివృద్ధి జరగాలంటే జగన్ మళ్లీ అధికారంలోకి రావొద్దనే నిర్ణయానికి కూటమి పార్టీలు వచ్చాయి. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే స్థిరమైన పాలన, పెట్టుబడులకు అనుకూల వాతావరణం అవసరమని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే జగన్ పాలనకు పూర్తిగా చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు కూటమి నేతలు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. పాలనలో ఎక్కడా అలసత్వం లేకుండా ప్రజలకు చేరువగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజల మధ్య ఉండాలని, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రజల్లో నమ్మకం పెంచడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారానే జగన్ తిరిగి రాజకీయంగా బలపడకుండా చేయవచ్చని చంద్రబాబు ఆదేశాలు ఇస్తున్నారు. మాటల రాజకీయాలు కాకుండా పనితనంతో ప్రజల మద్దతు సంపాదించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పారు చంద్రబాబు.