కమీషన్లకు కుక్కుర్తి పడి కల్తీ మద్యం అమ్మకాలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన దుర్మార్గపు, అవినీతి పరిపాలన జగన్ హయాంలో సాగిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచారశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. మద్యం అమ్మకాల్లో నల్లధనమంతా తాడేపల్లి ప్యాలెస్కు చేరిందని ఆరోపించారు. ద్వారకాతిరుమలలో గురువారం సాయంత్రం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి గ్రామంలో పర్యటించి గత ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలకు, పలు దుకాణదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాలన బేషుగ్గా ఉందని కితాబుచ్చారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయిని పెంచి, పిల్లల్ని బానిసలను చేయడంతోపాటు చదువులకు దూరం చేసి వారి భవిష్యత్తును కాలరాసారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తందని వివరించారు. ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ తమది రైతులు, కార్మికులు, కర్షకులు ఎక్కువగా ఉండే నియోజకవర్గమని, దాని అభివృద్ధికి మీ సహ కారం కావాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.