Vizianagaram Pydithalli Ammavaru: విజయనగర ఆడపడుచు.. పైడితల్లి అమ్మవారి విశిష్టత..

Vizianagaram Pydithalli Ammavaru: దసరా వచ్చిందంటే చాలు.. విజయనగరం పట్టణానికి పండగ వాతావరణం.

Update: 2021-10-18 09:21 GMT

Vizianagaram Pydithalli Ammavaru: దసరా వచ్చిందంటే చాలు.. విజయనగరం పట్టణానికి పండగ వాతావరణం. ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పూజలందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు దసరా నుండి ఆరంభమవుతాయి. విజయనగరమంతా సర్వాంగ సుందరంగా సిద్దమౌవుతుంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రతీఏటా ఘనంగా జరుగుతుంది.

విజయదశమి తరువాత వచ్చే మంగళవారం జరిగే సిరిమానోత్సవానికి ఉత్తరాంధ్రతో పాటు ఒడిషా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు. భక్తిశ్రద్దలతో అమ్మవారి మ్రొక్కులు తీర్చుకుంటారు. విజయనగరంలో జరిగే ఈ పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. విజయనగరం సంస్ధానానికి చెందిన ఆడపడుచు పైడిమాంబే... పైడితల్లి అమ్మవారిగా కొలవబడుతోంది.

258 ఏళ్ల క్రితం విజయనగరం సంస్దానానికి అప్పటి రాజు అన్న పెద విజయరామరాజు చెల్లెలే.. పైడిమాంబగా పెద్దలు చెబుతుంటారు. తాను దేవతగా అవతరించానని, తన ప్రతిమ పెద్ద చెరువులో వెలసి ఉందని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్టించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమయినట్టుగా ప్రచారం.

ఆవిగ్రహాన్ని బయటకు తీసి ఆ పెద్ద చెరువు ఒడ్డునే ఆలయం నిర్మించి ప్రతిష్టించి పూజలు చేశారు గ్రామస్ధులు. దీనిని నేడు వనం గుడిగా నిత్యం పూజలు చేస్తుంటారు భక్తులు. ఇలా పైడిమాంబ పైడితల్లిగా అవతరించారు.

పైడితల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన పతివాడ అప్పలనాయుడు తొలి పూజారిగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అప్పటినుండి ఇప్పటివరకు అప్పలనాయుడు వారుసులే అమ్మవారి పూజారులుగా కొనసాగుతున్నారు. ముందుగా అమ్మవారి ఉత్సవాలు వనంగుడి వద్ద నిర్వహించేవారు. 1924లో మూడు లాంతర్ల జంక్షన్ సమీపంలో మరోసారి అమ్మవారిని ప్రతిష్టించి చదురుగుడిని నిర్మించారు.

వనం గుడిని అమ్మవారి పుట్టినింటిగా, ఊరి మధ్యలో నిర్మించిన చదురుగుడిని మెట్టినింటిగా భావిస్తుంటారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరుపక్కలా ఘటాలు ఉండటం విశేషం.ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దీని మొదలులో అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటూ ఉంటారు. చదురు గుడి వద్దే పైడితల్లి ఉత్సవాలు జరుగుతాయి.

భక్తజన కోటితో పూజలందుకుంటున్న అమ్మవారి చదురు గుడిని 1951లో దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక అప్పటి నుండి ప్రభుత్వమే పైడితల్లి ఉత్సవాలను జరుపుతోంది. సుమారు నెల రోజుల పాటు అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు. పైడితల్లి ఉత్సవాల ప్రారంభానికి సూచికగా ప్రధాన రాటను ప్రతిష్టించడం, తొలేళ్ల ఉత్సవం, ఉయ్యాల కంబాల, సిరిమానోత్సవం ఇలా అనేక కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు నిర్వహిస్తారు.

ఆడపడుచులైతే అమ్మవారి కరుణా కటాక్షాలు పొందేందుకు ప్రత్యేకించి ఘటాలను ఎత్తుకుంటారు. కలశాలతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పైడితల్లి సిరిమానోత్సవం కోసం సిరమాను చెట్టు సేకరణ కూడా ఉత్సవంలా నిర్వహిస్తారు. సిరిమాను చెట్టును అధికారులు, పూజారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో.. ప్రత్యేక పూజలు నిర్వహించి సేకరించడం ఆనవాయితీగా వస్తోంది.

సిరిమానును అధిరోహించే పూజారి కులస్థులు సిరిమాను రధాన్ని తయారు చేస్తారు. పూజారి కూర్చోవటానికి వీలుగా ఓ శీలను తయారు చేస్తారు. అలా తయారు చేసిన శీలలోనే సిరిమానోత్సవం రోజున ప్రదాన అర్చకులు ఆశీనులౌవుతారు. సిరిమాను రధం వెంట తిరిగే బెస్తవల, అంజలి రధం, పాలధార, తెల్లఏనుగు రధాల తయారీ ప్రత్యేకంగా జరుగుతుంది.

ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించిన తరువాత అమ్మవారి ఆలయం నుండి సిరిమాను ఉత్సవం ప్రారంభమవుతుంది. సిరిమానుకు ముందు పాలధార, జాలరి వల, తెల్ల ఏనుగు రధాలు కదులుతుంటాయి. సిరిమాను మూడు లాంతర్ల జంక్షన్ నుండి కోట పూసపాటి రాజుల బురుజు వరుకు మూడుసార్లు తిరుగుతుంది. సిరిమానోత్సవం జరిగిన వారం రోజుల అనంతరం ..మంగళవారం రోజున అమ్మవారికి ఉయ్యాలకంబాల జరుపుతారు.

అదే విధంగా చివరగా అమ్మవారి విగ్రహం లభ్యమైన పెద్దచెరువులో హంసవాహనంపై తెప్పోత్సవాన్ని జరుపుతారు. ఈ క్రమంలో నెల రోజుల పాటు నిర్వహించే సాంస్కతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తాయి. అమ్మవారి జాతర సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో విజయనగరం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది.

పైడితల్లి అమ్మవారు వెలసిన విజయనగరం జిల్లాలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వాసం. ఆ చల్లని తల్లి పైడితల్లి ఈ నేలపై కొలువై ఉన్నందువల్లే ఈ ప్రాంతం ఎప్పుడూ సుభిక్షంగా అలరారుతోందని భక్తుల ప్రతీతి.

Tags:    

Similar News