Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీకి చెందిన కీలక నేత..
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడేందుకు ఏపీకి చెందిన ఓ కీలక నేత కేంద్రంలోని ముఖ్యమైన నేతల శరణు కోరుతున్నారు.;
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడేందుకు ఏపీకి చెందిన ఓ కీలక నేత కేంద్రంలోని ముఖ్యమైన నేతల శరణు కోరుతున్నారు. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుకూల ప్రకటన వచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
అయితే, ఈ కేసులో వెసులుబాటు ఇచ్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు కూడా అంగీకరించలేదు. దీంతో బీజేపీ అగ్రనేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేసు నుంచి బయటపడేయమని అడుగుతాడని తెలిసి.. ఢిల్లీలో ఏ ఒక్క బీజేపీ అగ్రనేత కూడా ఏపీ కీలకనేతకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. అయినా సరే.. బీజేపీ అగ్రనేతల ఇళ్ల చుట్టూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచడంతో.. ఒక్కో ఆధారం సేకరిస్తుండడంతో నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో మంత్రాంగం నడుపుతున్నారు ఈ కీలక నేత. ఈ కేసులో సంబంధం ఉన్న ముఖ్యులతో పాటు న్యాయనిపుణులతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు.
ఎవరి నుంచీ మద్దతు రాకపోవడంతో.. ఏకంగా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు నుంచి బయటపడేందుకు ఉన్న అన్ని మార్గాల్లోనూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే, ఈ కేసులో ఈడీకి పక్కా ఆధారాలు దొరుకుతుండటంతో ఎటూపాలుపోని స్థితిలో ఉన్నారు ఆ కీలక నేత.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలకనేతతో పాటు.. తన కుటుంబసభ్యులను రక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈడీ విచారిస్తున్న ఓ ఎయిర్‌వేస్ సంస్థ విమానాలను ఎక్కువసార్లు వినియోగించింది ఆ కీలక నేతనే.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వద్ద దీనికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా ఉన్నాయి. దీంతో కేసు నుంచి తాను బయటపడేందుకు, తన వాళ్లను రక్షించేందుకు పలు మార్గాల్లో ఎంతకైనా సిద్ధమయ్యారు కీలక నేత. ఊహించని రీతిలో పెద్ద ఎత్తున నగదు వ్యవహారాలు సైతం నడిపిస్తున్నారు. ఏపీకి చెందిన ఆ కీలకనేత తరఫున ఢిల్లీలోని ఓ ఉన్నతస్థాయి అధికారి వ్యవహారాలు చక్కబెడుతున్నారు.