Chandrababu : బాబు గదిలో ఏసీ ఏర్పాటు
వైద్యుల కీలక నివేదిక.. 24 గంటల పాటు వైద్యం..;
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయనకు చల్లదనం కల్పించేలా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం రాజమహేంద్రవరం జైలు అధికారులను ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యుల నివేదిక మేరకు... తగిన ఏర్పాట్లు చేసే విధంగా జైలు అధికారులను ఆదేశించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ACB కోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేశారు. దీనిపై న్యాయాధికారి ఆన్‌లైన్‌లో విచారించి ఆదేశాలు జారీ చేశారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయనకు చల్లదనం కల్పించేలా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే చర్యలు చేపట్టాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌కు స్పష్టం చేసింది. నైపుణ్యాభివృద్ధి కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు..... అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం వల్ల రెండు వారాలుగా డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ఆయన్ను చల్లని వాతావరణంలో ఉంచకపోతే ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని, అందుకు అవసరమైన సదుపాయాల్ని కల్పించాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు శనివారం సాయంత్రం ఏసీబీ కోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేశారు.
దీనిపై న్యాయాధికారి హిమబిందు ఆన్‌లైన్‌లో విచారించి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన్ను చల్లని వాతావరణంలో ఉంచాలని వైద్యులు సూచించారని, వాటిని పరిగణలోనికి తీసుకొని తగిన సదుపాయాలు కల్పించాలని పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా ఏసీబీ కోర్టుకు విన్నవించారు. చంద్రబాబును పరీక్షించిన బృందంలోని వైద్యులు విచారణకు హాజరై... అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆరోగ్యపరంగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని, ఆయన్ను చల్లని వాతావరణంలో ఉంచకపోతే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందని వివరించారు. జైలు సూపరింటెండెంట్ సెలవులో ఉండటంతో ఆ శాఖ డీఐజీ రవికిరణ్ విచారణకు హాజరయ్యారు. జైలు మాన్యువల్ ప్రకారం ఏసీ ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదని, న్యాయస్థానం ఆదేశిస్తే ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని న్యాయాధికారి అడగ్గా... సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద స్పందిస్తూ... నిర్ణయాన్ని కోర్టు విచక్షణాధికారానికి వదిలేస్తున్నట్లు చెప్పారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని, చంద్రబాబు ఉన్న బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఏసీబీ కోర్టు సూచన మేరకు శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఓ టవర్ ఏసీని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం లోపలకు తీసుకెళ్లినట్లు సమాచారం.